ఏప్రిల్ లో ఎన్నికలు: ఉత్తమ్

ఏప్రిల్ లో ఎన్నికలు: ఉత్తమ్

ఈ నెలాఖరుకు పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఏప్రిల్ లో ఎన్నికలు ఉంటాయని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డాడు. నేడు ఆయన పార్టీ నాయకులతో టెలికాన్ఫరెన్సు లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వచ్చే 60 రోజులు పార్టీ కోసం కష్టపడి పనిచేయండని పార్టీ నాయకులను కోరారు. అభ్యర్థుల ఎంపిక కోసం దరఖాస్తులు తీసుకుంటున్నాం. 14 వ తేదీ సాయంత్రము 5 గంటల వరకు గడువు ఉందని తెలిపారు. ఇది ప్రధాని మోడీ.. రాహుల్ గాంధీ మధ్య జరిగే ఎన్నికలు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయటానికి అంతా కష్టపడి పని చేయండని నాయకులను ఆదేశించారు. దేశాన్ని మతపరంగా విచిన్నం చేశారు మోడీ. మైనార్టీలో అభద్రత పెంచిన ఘనత మోడీదే. నిరుద్యోగులకు ఏడాది 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని.. 2 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయారని విమర్శించారు. మోడీ అధికారంలోకి వచ్చాక రైతులు కష్టాల్లో కూరుకుపోయారు. రాహుల్ ప్రధాని అయ్యాక రైతుకు అన్నిపంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తాం. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో కి వస్తే.. వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తాం అని ఉత్తమ్ హామీ ఇచ్చారు.

క్షేత్ర స్థాయి అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని ఉత్తమ్ స్పష్టం చేశారు. కొత్త డీసీసీలు, ఎంపీ అభ్యర్థుల పేర్లు సిఫారసు చేయండి. 15వ తేదీ ఉదయంలోపు అభ్యర్థుల పేర్లు సిఫారసు చేయండి. 15, 16, 17 తేదీల్లో పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమీక్ష ఉంటుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎం, ఓటర్ల జాబితా మీద అనుమానాలు వచ్చాయి. వాటిని అధిగమించటానికి బూత్ లెవల్ ఏజెంట్లు జాగ్రత్త పడాలి. బూత్ లెవల్ ఏజెంట్లు చాలా చోట్ల లేరు. 15వ తేదీ లోపు బూత్ లెవల్ ఏజెంట్లను నియమించి జాబితాతో సమీక్షకి రండని పార్టీ నాయకులకు సూచించారు.