సిద్ధంగా లేకుంటే జనవరి లేదా ఫిబ్రవరిలో ఎన్నికలు

సిద్ధంగా లేకుంటే జనవరి లేదా ఫిబ్రవరిలో ఎన్నికలు

ఎన్నికలకు పూర్తిగా సిద్ధంకాని పక్షంలో తెలంగాణ  రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ...నాలుగు రాష్ట్రాల అసెంబ్లీతో పాటు జరగవని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఓపీ రావత్‌ అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు అన్ని రకాలుగా రాష్ట్రం సిద్ధంగా ఉండాలని ఆయన పునరుద్ఘాటించారు. ఈ ఏడాది చివర్లో ఉత్తరాదిలో నాలుగు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అప్పటికి తెలంగాణ రాష్ట్రం రెడీ కాకపోతే వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన అన్నారు. తెలంగాణలో ఎన్నికలు నిర్వహించేందుకు మార్చి 5వ తేది వరకు సమయముందని ఆయన చెప్పారు. 'ఆరు నెలల్లో ఎన్నికలు కచ్చితంగా జరిగి తీరాల్సిందేనని ఎక్కడా చట్టంలో లేదు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలి. అసెంబ్లీ రద్దు తరవాత వెంటనే ఎన్నికలు నిర్వహించాలని, ఆ ప్రక్రియ ఆరు నెలలు దాటకముందే పూర్తి చేయాలని సుప్రీం కోర్టు చెప్పింద'ని రావత్ అన్నారు. ఎన్నికల నిర్వహణకు తెలంగాణ సిద్ధంగా లేకుంటే, ఆ రిస్క్ (ఎన్నికల నిర్వహణ) తాము తీసుకోమని రావత్ అన్నారు. అన్ని సిద్ధమైతే.. కచ్చితంగా... అన్ని సిద్ధమైతేనే తెలంగాణలో ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన పునరుద్ఘాటించారు.