ఆర్టీసీ సమ్మె.. కార్యాచరణ ప్రకటించిన జేఏసీ

ఆర్టీసీ సమ్మె.. కార్యాచరణ ప్రకటించిన జేఏసీ

ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్రత పెరుగుతోంది.  భవిష్యత్‌ కార్యాచరణ, ప్రభుత్వం తీరు, అనుసరించాల్సిన వ్యూహాలపై హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో... అఖిలపక్షం, ఆర్టీసీ జేఏసీ నేతలు సమావేశమయ్యారు. ఆర్టీసీ సమ్మెకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాలని జేఏసీ నేతలు విజ్ఙప్తి చేశారు. రాజకీయ పక్షాలు చేసే ఆందోళన కార్యక్రమాల్లో కార్మికులు పాల్గొని విజయం వంతం చేయాలని కోరారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రగతి భవన్‌ ముట్టడిలో ఆర్టీసీ కార్మికులు పాల్గొనాలని జేఏసీ పిలుపునిచ్చింది.  

ఇక, ఆర్టీసీ జేఏసీ చేపట్టే అన్ని నిరసన కార్యక్రమాలకు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. సోమవారం ఆర్టీసీ కార్మికుల కుటుంబాల ధర్నా, 22న తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను విధులకు రావద్దని కోరడంతో పాటు... బస్సులో ప్రయాణించే వారికి టిక్కెట్లు ఇచ్చి సంస్థను కాపాడాలని కోరనున్నారు. 23న ప్రజాప్రతినిధులను కలిసి డిమాండ్లను వివరించడం, 24న ఆర్టీసీ మహిళా సిబ్బందితో ధర్నాలు, 25న రాస్తారోకోలు, రహదారుల దిగ్బంధం, 26న ఆర్టీసీ కార్మికుల పిల్లలతో ధర్నా చేయనున్నారు.  27న వామపక్ష పార్టీల నేతలు, కార్యకర్తల కుటుంబాలు ఆర్టీసీ కార్మికుల కుటుంబ సభ్యులను పిలిచి భోజనాలు చేయడం, 28, 29 నిరసన ప్రదర్శనలు, 30న సకల జనుల సమరభేరీ నిర్వహించేలా వచ్చే పదిరోజుల్లో ఆర్టీసీ జేఏసీ కార్యచరణ రూపొందించింది. మరోవైపు హైకోర్టు సూచన మేరకు ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని రాజకీయ పార్టీల నేతలు డిమాండ్‌ చేశారు.