టెన్త్ ఫలితాలపై ఉత్కంఠ..!

టెన్త్ ఫలితాలపై ఉత్కంఠ..!

తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయి. ఇవాళ ఉదయం 11.30 గంటలకు ఫలితాలను వెల్లడించనున్నట్లు విద్యాశాఖ పేర్కొంది. విద్యాశాఖ కార్యదర్శి జనార్థన్‌రెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇంటర్ ఫలితాల్లో నెలకొన్న గందరగోళం పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. కాగా, ఇంటర్మీడియట్ ఫలితాల్లో చోటు చేసుకున్న అవకతవకలతో.. టెన్త్ ఫలితాల్లో ఎలాంటి పరిణామాలు ఉంటాయో అనే ఉత్కంఠ నెలకొని ఉంది. కాగా, సచివాలయంలోని ‘డీ’ బ్లాక్ కాన్ఫరెన్స్ హాలులో ఫలితాల విడుదల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని విద్యాశాఖ కార్యదర్శి బి. జనార్దన్ రెడ్డి, టీఎస్‌బీఎస్‌ఈ కార్యదర్శి విజయకుమార్ వెల్లడించారు. పదో తరగతి ఫలితాల విడుదలలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. విద్యాశాఖ కార్యదర్శి బి. జనార్దన్ రెడ్డి నేతృత్వంలో ఇప్పటికే పలుమార్లు ఉన్నతస్థాయిలో ఈ అంశంపై సమావేశాలు జరిగాయి. టీఎస్‌బీఎస్‌ఈ కార్యదర్శి విజయకుమార్‌తోపాటు ఇతర అధికారులతో కూడా జనార్దన్ రెడ్డి చర్చించారు. పదో తరగతి పరీక్షలు 2019 మార్చి 16 నుండి ఏప్రిల్ 2 వరకు నిర్వహించారు. పరీక్షలు పూర్తయిన 40 రోజుల్లో ఫలితాలను విడుదల చేస్తున్నారు. ఫలితాల వెల్లడిలో ఎలాంటి తప్పులకు అవకాశం లేకుండా చూసేందుకు కొద్దిగా సమయం ఎక్కువ తీసుకున్నట్టు తెలుస్తోంది.