అభ్యర్థులకు చుక్కలు చూపిస్తున్న తెలంగాణ ఓటర్

అభ్యర్థులకు చుక్కలు చూపిస్తున్న తెలంగాణ ఓటర్

తెలంగాణలో ఎన్నికలకు మరో నెల రోజులే సమయం ఉండటంతో పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. అభ్యర్తులను ప్రకటించి టీఆర్‌ఎస్‌ ఒకడుగు ముందుకేసింది. ఇపుడు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ప్రచారంలో దూసుకెళ్తున్న గులాబీ అభ్యర్థులకు పలుచోట్ల ప్రజల నుంచి నిరసన సెగలు తగులుతున్నాయి. మాజీ మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, కొత్త ముఖాలు అనే తేడా లేకుండా ప్రజలు ఎవరొచ్చినా ఇన్నాళ్లూ ఎక్కడున్నారు? ఏం చేశారని నిలదీస్తున్నారు. జనం నుంచి ఎదురవుతున్న ప్రశ్నలకు జవాబు చెప్పలేక అభ్యర్థులు అక్కడి నుంచి తప్పుకొని పోతున్నారు. అధికార పార్టీ కావడంతో జనం నుంచి గట్టి ప్రశ్నలే ఎదురువుతున్నాయి.

అసెంబ్లీ రద్దు కాక ముందు వేరు. అధికారం ఉన్నపుడు జనం ఆచి తూచి స్పందిస్తారు. మనకెందుకు వచ్చిన గొడవలే అంటూ సర్దుకుపోతారు.  ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పడి అధికారం అనే బెత్తం పోగానే జనం కాస్త  భయం పోయినట్లుంది. అది అధికార పార్టీ అభ్యర్థుల ప్రచారంలో స్పష్టంగా తెలుస్తోంది. తాజా మాజీ ఎమ్మెల్యేలు ఓటడగడానికి ఊళ్లలోకి వెళ్తే ప్రజలు వారి పరువు తీస్తున్నారు. నాలుగున్నరేళ్లలో ఏం చేశావని మళ్లీ వచ్చావని కడిగి పారేస్తున్నారు. గులాబీ దండు గ్రామాల్లోకి అడుగు పెట్టకుండా పొలిమేరల్లోనే చుక్కలు చూపిస్తున్నారు.

ఇతర పార్టీ అభ్యర్థులు ప్రకటించాక.. క్షేత్రస్థాయిలో మార్పులు రావొచ్చు. టీఆర్‌ఎస్‌పై విమర్శల హవా కొనసాగే పక్షంలో అధికార పక్ష మద్దతుదారులు కూడా రేపు కూటమి అభ్యర్థులపై విరుచుకుపడే అవకాశాలున్నాయి. ఉద్యమ సమయంలో అనేక మంది యువకుల ఆత్మబలిదానంతో పాటు.. కూటమి బలహీనతలపై నిలదీయొచ్చు. ఇదొక ట్రెండ్‌ కానంత వరకు పర్వాలేదు. ఇదే పద్ధతి ఉధృతమైతే ... జనంలోకి వెళ్ళడానికి ఏ పార్టీ అభ్యర్థికైనా జ్వరం వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. నిలదీయం ఒక ట్రెండ్‌గా మారితే మాత్రం... అన్ని పార్టీలకు చుక్కలే. కాకపోతే అధికార పార్టీకి కష్టాలు మరీ ఎక్కువగా ఉంటాయి. మొత్తానికి జనం ప్రశ్నించడం మొదలైంది.