చంద్రబాబు దీక్షకు సినీ ఇండస్ట్రీ మద్దతు...

చంద్రబాబు దీక్షకు సినీ ఇండస్ట్రీ మద్దతు...
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తలపెట్టిన నిరాహార దీక్షకు మద్దతు ప్రకటించింది టాలీవుడ్. ఇప్పటికే సినీ పెద్దలు ఓ సారి చంద్రబాబును ఆయన నివాసంలో కలిసి హోదా పోరులో కలిసి వస్తామని సంఘీభావం తెలిపిన సంగతి తెలిసిందే. అయితే రేపు చంద్రబాబు చేపట్టే దీక్షకు తెలుగు సినీ ఇండస్ట్రీ అండగా ఉంటుందని ప్రకటించారు నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. హోదా ఉద్యమంతో పాటు సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ పై ఈ రోజు మీడియాతో మాట్లాడిన తమ్మారెడ్డి... హోదా ఉద్యమానికి సినీ ఇండస్ట్రీ అండగా ఉంటుందని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి కేంద్రం ఎందుకు వెనుకడుగు వేస్తోందో అర్థం కావడంలేదన్న తమ్మారెడ్డి... ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని వ్యాఖ్యానించారు. హోదా కోసం ఇంత ఉద్యమం జరుగుతున్నా కేంద్రం ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించిన ఆయన... తాను ఏ పార్టీకి చెందినవాడిని కాదని... తెలుగు ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటానన్నారు. అయితే హక్కుల సాధన కోసం కేంద్రంపై ఉద్యమించాలి తప్ప... నేతలు పరస్పరం విమర్శలు మానుకోవాలని సూచించారు తమ్మారెడ్డి.