గూగుల్ డూడుల్ లో భారత సూపర్ స్టార్

గూగుల్ డూడుల్ లో భారత సూపర్ స్టార్

కేలండర్ లో వచ్చే ప్రతి రోజుకి ఏదో ఒక ప్రత్యేకత తప్పకుండా ఉంటుంది. ప్రస్తుతం బిజీ లైఫ్ తో గజిబిజిగా ఉంటున్న ప్రజలు తమ వ్యక్తిగత జీవితంలోని ప్రత్యేక రోజులనే గుర్తుంచుకోవడం లేదు. ఇక మిగతావాటి సంగతి అయితే చెప్పనక్కర్లేదు. అందుకే ప్రముఖ సెర్చ్ ఇంజిన్ సంస్థ గూగుల్ తన డూడుల్స్ తో ఆయా రోజులను గుర్తు చేస్తుంటుంది. అదే కోవలో ఇవాళ భారతదేశం గర్వించదగ్గ తొలి రికార్డింగ్ సూపర్ స్టార్ గౌహర్ జాన్ 145వ జయంతిని  ఓ ప్రత్యేక డూడుల్ ద్వారా గుర్తు చేసింది. కుడిచేతిలో పిల్లి, అదే చేతివేళ్లలో గులాబీ పట్టుకొని గ్రామఫోన్ ముందు ఆలపిస్తున్న గౌహర్ జాన్ డూడుల్ అందరినీ ఆకర్షిస్తోంది. 

జూన్ 26, 1873లో ఉత్తరప్రదేశ్ లోని ఆజంగఢ్ లో జన్మించారు సింగర్-డాన్సర్ గౌహర్ జాన్. నిజానికి ఆర్మీనియా మూలాలు ఉన్న ఆమె పేరు ఏంజెలీనా యోవర్డ్. భర్త నుంచి విడాకులు పొందిన ఆమె తల్లి విక్టోరియా ఖుర్షీద్ అనే వ్యక్తితో బెనారస్ వచ్చారు. అప్పుడే విక్టోరియా, ఏంజెలీనా ఇస్లాం మతం స్వీకరించారు. ప్రముఖ గాయని, కథక్ నృత్యకారిణి అయిన విక్టోరియా తన పేరును మలికా జాన్ గా మార్చుకున్నారు. ఎనిమిదేళ్ల ఏంజెలీనా పేరును గౌహర్ జాన్ గా మార్చారు. అప్పట్లో మలికా జాన్ ఆటపాట బాగా ప్రసిద్ధి పొందాయి. ఆ తర్వాత ఆమె కలకత్తా వెళ్లిపోయి నవాబ్ వాజిద్ అలీ షా కొలువులో ఆస్థాన విద్వాంసురాలిగా స్థిరపడ్డారు. 

కలకత్తాలో గౌహర్ జాన్ నాట్యం, సంగీతం నేర్చుకున్నారు. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో ప్రావీణ్యం సంపాదించారు. బిర్జూ మహారాజ్ తాతగారైన బృందాదీన్ మహారాజ్ దగ్గర కథక్ నృత్యం అభ్యసించారు. గౌహర్ జాన్ తన మొదటి ప్రదర్శన 1887లో నేటి బీహార్ రాష్ట్రంలోని దర్భంగాలో ఇచ్చారు. 1896 నుంచి ఆమె కలకత్తాలో అనేక ప్రదర్శనలు ఇచ్చారు. అప్పటికే ఆమె పాటలు అనేకం గ్రామఫోన్ రికార్డులుగా వచ్చాయి. 78 rpm రికార్డుల్లో పాటలు రికార్డ్ చేసిన మొదటి తరం గాయనీమణుల్లో ఆమె ఒకరు. రికార్డింగ్ కంపెనీలు ఫస్ట్ డాన్సింగ్ గర్ల్ అని ప్రముఖంగా ప్రస్తావించేవి.  

దేశవ్యాప్తంగా అనేక ప్రదర్శనలు ఇచ్చారు గౌహర్ జాన్. ఐదో కింగ్ జార్జి ముందు ఢిల్లీ దర్బారులో సంగీత ప్రదర్శనకు ఆమెను ఆహ్వానించారు. గౌహర్ జాన్ హమ్ దమ్ పేరులో అనేక గజళ్లు కూడా రాశారు. తన చివరి రోజుల్లో ఆమె మైసూరు మహారాజు నాలుగో కృష్ణరాజ వడియార్ కోరిక మేరకు అక్కడకు వెళ్లారు. అక్కడ ఆమెను ఆస్థాన గాయనిగా నియమించారు. జనవరి 17, 1930న ఆమె తుదిశ్వాస విడిచారు.