తెలుగు రాష్ట్రాల సీఎంల కీలక భేటీ..

తెలుగు రాష్ట్రాల సీఎంల కీలక భేటీ..

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు సమావేశం కానున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య స్నేహ సంబంధాలను పటిష్ఠం చేయడంతో పాటు ఇద్దరి మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా ఏపీ, టీఎస్ సీఎంలు... ఇవాళ, రేపు సమావేశమై చర్చించనున్నారు. గోదావరి, కృష్ణా నదులకు సంబంధించిన ప్రధానాంశాలు సహా 5 కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి. ఇప్పటికే పలు దఫాలు లాంఛనంగా సీఎంల సమావేశాలు జరిగాయి. గవర్నర్‌ నరసింహన్‌ సమక్షంలోనూ చర్చించారు. దీనికి అనుగుణంగా కార్యాచరణ చేపట్టేందుకు ఇరు రాష్ట్రాల సీఎంలు సన్నద్ధమయ్యారు. ఇద్దరు సీఎంల మధ్య తొలి ఉన్నతస్థాయి సమావేశం ఇవాళ ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో ప్రారంభం కానుంది. గోదావరి వరద జలాల తరలింపు, కృష్ణా, గోదావరి బేసిన్లలో నీటిని రెండు రాష్ట్రాలు సమగ్రంగా వినియోగించుకోవడం, విద్యుత్తు సంస్థల విభజన, తొమ్మిది, పదో షెడ్యూలు సంస్థల విభజన సహా పలు కీలకాంశాలపై చర్చించనున్నారు. ప్రధాన అంశాలపై ఓ అంగీకారానికి వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇక, ఈ సమావేశానికి తెలంగాణ నుంచి ఏడుగురు, ఏపీ నుంచి ఐదుగురు మంత్రులు హాజరవుతారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఎస్‌కే జోషి, ఎల్వీ సుబ్రహ్మణ్యం, నీటిపారుదల, ఆర్థిక, విద్యుత్‌, పౌరసరఫరాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, సాధారణ పరిపాలన శాఖల ముఖ్యకార్యదర్శులు, ఉన్నతాధికారులు పాల్గొంటారు. వీరితోపాటు రెండు ప్రభుత్వాల సలహాదారులు, నీటిపారుదల శాఖ, ఆర్థిక, ఇంధన శాఖల ముఖ్యకార్యదర్శులు, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌లు, పునర్విభజన చట్టం అమలుకు సంబంధించిన అధికారులు పాల్గొననున్నట్టు తెలుస్తోంది.