మళ్లీ తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ.. అజెండా ఇదే..!

మళ్లీ తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ.. అజెండా ఇదే..!

ఇప్పటికే పలు మార్లు సమావేశమైన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరోసారి భేటీ అయ్యేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 24వ తేదీన ఇద్దరు సీఎంలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కేసీఆర్‌లు.. హైదరాబాద్‌లో భేటీకానున్నారు. ఇప్పటికే ఉమ్మడి  రాష్ట్రాల ప్రాజెక్టులపై చర్చించిన ముఖ్యమంత్రులు తాజాగా నదుల అనుసంధానంపై చర్చించనున్నారు. సీఎంలతోపాటు పలువురు మంత్రులు, అధికారులు ఈ భేటీకి హాజరుకానున్నారు. గత సమావేశాల్లో విభజన సమస్యలతో పాటూ ఇరిగేష్ ప్రాజెక్టులు, నీట పంపకాలపై చర్చించారు. ఇప్పుడు గోదావరి జలాలను శ్రీశైలానికి ఎలా తరలించాలనే అంశంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చిస్తారని  తెలుస్తోంది. 

రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన అంశాలపై ఉభయులూ చర్చించే  అవకాశం ఉంది. గతంలో గోదావరి నీటిని శ్రీశైలం జలాశయానికి తరలించే వ్యూహం ఖరారు చేయాలని ఓ  కమిటీని ఏర్పాటు చేశారు. ఇరు రాష్ట్రాల అధికారులు, ఇంజినీర్లకు ఇందులో అవకాశం కల్పించారు. ఎక్కడి నుంచి ఎలా నీరు తరలించాలన్న విషయంపై నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించారు. అయితే, తెలంగాణ భూభాగం నుంచి గోదావరి నీటిని తరలించాలని ఏపీ ఇంజనీర్లు, ఏపీలో మరో రిజర్వాయర్ నిర్మాణం చేస్తూ.. కాల్వలను వెడల్పు చేయడం ద్వారా నీటిని నాగార్జునసాగర్, అక్కడి నుంచి శ్రీశైలం తరలించవచ్చునని తెలంగాణ అధికారులు వేర్వేరు ప్రతిపాదనలు రూపొందించారు. ఒకరి ప్రతిపాదనలు ఒకరికి నచ్చకపోవడంతో ఈ అంశం అప్పటికి ఆగిపోయింది. దీనిపై ఇప్పుడు కేసీఆర్ పట్టుబడుతున్నట్టు సమాచారం. మొత్తం మీద  మరో వివాదానికి సంబంధించిన వ్యవహారంపై ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు 24న జరగనున్న సమావేశంలో ఏం నిర్ణయం తీసుకుంటారన్నదానిపై ఆసక్తి నెలకొంది.