ఆయన ఆప్యాయంగా మాట్లాడేవారు: చిరంజీవి

ఆయన ఆప్యాయంగా మాట్లాడేవారు: చిరంజీవి

ప్రముఖ నటుడు రాళ్లపల్లి మృతిచెందడంతో తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ఈ సందర్భంగా రాళ్లపల్లితో తమకున్న అనుబంధాన్ని పలువురు నటులు గుర్తు చేసుకుంటున్నారు. రాళ్లపల్లి కన్ను మూయడం చాలా బాధాకరమని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

'చెన్నైలోని వాణి మహల్‌లో డ్రామాలు వేస్తున్నప్పుడు తొలిసారి రాళ్ళపల్లి గారిని కలిశాను. స్టేజ్ మీద ఆయన నటన చూసి ముగ్ధుడినయ్యాను. ఆయన నటనను ఎంతో అభిమానించే వాడిని. ఆ తర్వాత ఆయన సినిమాల్లోకి వచ్చారు. నాతో కలిసి పలు చిత్రాల్లో నటించారు. దాంతో ఆయనతో అనుబంధం పెరిగింది. ఎక్కడ కలిసినా ఆప్యాయంగా మాట్లాడేవారు. చక్కని స్నేహశీలి. చాలా రోజుల తర్వాత ఆ మధ్య 'మా' ఎన్నికల సందర్భంగా కలుసుకున్నాను. 'ఎలా ఉన్నావు మిత్రమా?' అంటూ ఇద్దరం ఒకరిని ఒకరం పరస్పరం పలకరించుకున్నాం. అదే ఆఖరి చూపు అయ్యింది. ఇంతలో ఆయన తనువు చాలించారంటే చాలా బాధగా అనిపిస్తోంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేసుకుంటున్నాను' అని చిరంజీవి పేర్కొన్నారు.