తాత్కాలిక కండక్టర్ చేతివాటం....17వేలు స్వాహా !

తాత్కాలిక కండక్టర్ చేతివాటం....17వేలు స్వాహా !

సమ్మె కారణంగా బస్సుల్లేక.. ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే.. తాత్కాలిక సిబ్బంది మాత్రం అందినకాడికి దోచుకుంటున్నారు. ఖమ్మం జిల్లా మధిర డిపోలో అటువంటి నిర్వాకమే బయటపడింది. తాత్కాలిక కండెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న శేఖర్ ప్రతీ రోజు డిపోలో తక్కువగా చెల్లిస్తున్నాడు. అయితే, డిపోలో డబ్బు కట్టే సమయంలో అతని జేబు నుంచి అదనపు టికెట్లు కింద పడ్డాయి. గమనించిన సెక్యూరిటీ తీగలాగితే అసలు విషయం బయటపడింది. నకిలీ టికెట్లతో రూ.17వేలు స్వాహా చేశాడని తేలింది. దీంతో డబ్బులు స్వాహా చేసిన సదరు తాత్కాలిక కండక్టర్‌పై ఆర్టీసీ డిపో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మరో పక్క ప్రయాణికులకు పాత టికెట్లు ఇచ్చి డబ్బులు వసూలు చేసిన తాత్కాలిక కండక్టర్‌ ఉదంతం ఒకటి నిన్న వెలుగు చూసింది. షాద్‌నగర్‌ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులో శనివారం ఫరూఖ్‌నగర్‌ మండలం నేరేళ్ళచెరువు గ్రామానికి చెందిన ప్రైవేట్‌ కండక్టర్‌ కె.శివకుమార్, డ్రైవర్‌ ఎండీ గౌస్‌ విధులు నిర్వహిస్తున్నారు. అయితే, బస్సును గద్వాల డిపో మేనేజర్‌ మురళీధర్‌రెడ్డి షాద్‌నగర్‌లో తనిఖీ చేశారు. టికెట్ల అమ్మకం ప్రకారం కండక్టర్‌ కె.శివకుమార్‌ క్యాష్‌ బ్యాగ్‌లో రూ.3143 ఉండాలి. కానీ, రూ.4470 ఉన్నట్లు గుర్తించారు. ప్రయాణికులకు టికెట్లు అమ్మిన తర్వాత వాటిని తిరిగి కండక్టర్‌ ప్రయాణికుల నుంచి తీసుకొని బ్యాగులో ఉంచుకున్నట్లు తేలింది.