భిన్నంగా ఎగ్జిట్‌ పోల్స్‌.. ఏపీ నేతల్లో టెన్షన్‌..!

భిన్నంగా ఎగ్జిట్‌ పోల్స్‌.. ఏపీ నేతల్లో టెన్షన్‌..!

సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది.. ఫలితాలు వెలువడాలంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే. అయితే, ఎన్నికల ఫలితాల కంటే ముందు, అదే స్థాయిలో ఉత్కంఠ రేపిన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు మాత్రం ఆదివారం ప్రకటించాయి వివిధ ఛానెళ్లు, సర్వే సంస్థలు. దేశవ్యాప్తంగా ఎన్డీఏ, యూపీఏ కూటమికి, ఇతర ప్రాంతీయ పార్టీలకు వచ్చే సీట్లపై ఓ అంచనా వేశాయి. ఇక, వాటితో పాటు ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ, లోక్‌సభ ఎన్నికల సంబంధించిన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను కూడా ప్రకటించాయి. జాతీయ ఛానెళ్లతో పాటు, ఆంధ్ర ఆక్టోపస్‌ లగడపాటి రాజగోపాల్, ఇతర సర్వే సంస్థలు ఏపీలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే విషయంలో తలో లెక్కలు వేశాయి. కొన్ని సంస్థలు ఏపీలో మళ్లీ టీడీపీయే అధికారంలోకి వస్తుందని తేల్చగా.. మరికొన్ని సంస్థలు ఈసారి వైసీపీకే ఆంధ్ర ఓటర్లు పట్టం కట్టబోతున్నారని ప్రకటించాయి. అయితే, జనసేన ఎంట్రీతో పరిస్థితి మారుతుందని అంచనా వేసినా..! రాష్ట్రంలో హంగ్‌కి అవకాశం ఉన్నట్టు ఏ సంస్థా పేర్కొనలేదు. ఇటు టీడీపీకి అనుకూలంగా చెప్పిన సంస్థలుగానీ, అటు వైసీపీకి అనుకూలంగా ఫలితాలు ఉంటాయన్న సంస్థలుగానీ పూర్తిస్థాయి మెజార్టీనే కట్టబెట్టాయి. ఎగ్జిట్స్‌ పోల్స్‌ని బట్టి చూస్తే పవన్ కల్యాణ్... జనసేన పార్టీకి స్వల్ప సంఖ్యలో సీట్లే దక్కుతాయని అర్ధమవుతోంది. త్రిముఖ పోరులో జనసేన పార్టీ భారీగా ఓట్లు పొందండంతో టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ పార్టీ విజయావకాశాల్ని దెబ్బతీసిందన్న విషయంలో క్లారిటీ లేదు. ఇక, ఎగ్జిట్ పోల్స్‌ను కొట్టిపారేస్తున్న రాజకీయ నేతలు.. తమ పార్టీకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా.. అధికారం చేపట్టబోయేది మేం అంటే.. మేమే నంటూ అటు టీడీపీ, ఇటు వైసీపీ నేతలు విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నా.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల వెల్లడి తర్వాత టెన్షన్ పడుతోన్నట్టు తెలుస్తోంది. కొందరు నేతలైతే.. మరోసారి నియోజకవర్గంలో పరిస్థితి ఏంటి అనే విషయంపై ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఎన్నికల ఫలితాలకు ముందు వెలువడిన ఎగ్జిట్ పోల్స్.. ఇప్పుడు ఏపీ నేతల్లో మరింత టెన్షన్ పెంచాయంటున్నారు.