రేపు రీపోలింగ్.. చంద్రగిరిలో మళ్లీ టెన్షన్..!

రేపు రీపోలింగ్.. చంద్రగిరిలో మళ్లీ టెన్షన్..!

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో మరో సారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నియోజకవర్గ పరిధిలోని రామచంద్రపురం మండలం కుప్పం బాదూరు, కాలేపల్లిలోని పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. దీంతో రీపోలింగ్‌కు ఓవైపు చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే, ఇదే సమయంలో కుప్పం బాదూరులో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రేపే పోలింగ్ కావడంతో ప్రచారం చేసేందుకు కుప్పం బాదూరు వెళ్లారు.. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని... కానీ, ఆయన ప్రచారానికి రాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. టీడీపీ నేతలతో వాగ్వాదానికి దిగారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా మోహరించారు పోలీసులు.