పల్నాడులో టెన్షన్.. టెన్షన్..

పల్నాడులో టెన్షన్.. టెన్షన్..

పల్నాడు పంచాయితీ పతాక స్థాయికి చేరింది. చలో ఆత్మకూరుకు ప్రతిపక్ష టీడీపీ పిలుపునిస్తే... తాము కూడా ర్యాలీ తీస్తామని అధికార వైసీపీ ప్రకటించింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఉద్రిక్తతలు తగ్గించే ప్రయత్నాలు ప్రారంభించారు. 144 సెక్షన్‌ విధించడంతో పాటు రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ను రంగంలోకి దించారు. టీడీపీనేతలను ఎక్కడికక్కడ హౌజ్ అరెస్ట్ చేస్తున్నారు. పల్నాడులో పరిస్థితి స్వయంగా డీజీపీ పర్యవేక్షిస్తున్నారు. . గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పలువురు టీడీపీ నేతలను హౌస్‌ అరెస్ట్‌ చేశారు పోలీసులు. ముందస్తు చర్యల్లో భాగంగా ఈ అరెస్టులు జరిగాయి. చిలకలూరిపేటలో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావును హౌస్‌ అరెస్ట్‌ చేశారు. అలాగే, ఆయన ఇంటి వద్ద పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేశారు అధికారులు. మాజీ మంత్రి దేవినేని ఉమ, తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్‌, వర్ల రామయ్య, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నలను కూడా హౌస్‌ అరెస్ట్‌ చేశారు పోలీసులు. 

గుంటూరు జిల్లా పల్నాడులో వైసీపీ అరాచకం సృష్టిస్తోందని ఆరోపిస్తున్న టీడీపీ... తమ వాళ్లను పునరావాస శిబిరాలకు తరలించింది. రాజకీయ కక్షసాధింపులో భాగంగా జరుగుతున్న ఈ దాడుల నుంచి తమ వాళ్లను రక్షించుకుంటామని స్పష్టం చేసింది. టీడీపీ శిబిరాలకు వెళ్లిన పోలీసులు... బాధితులను ఇళ్లకు చేరుస్తామని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ, వాళ్లతో వెళ్లేందుకు నిరాకరించాయి బాధిత కుటుంబాలు. జరగాల్సిన నష్టం జరిగిపోయాక... ఇప్పుడు తమకు రక్షణ కల్పిస్తామంటే ఎలా నమ్మాలని ప్రశ్నించాయి. మరోవైపు ప్రజలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వ విఫలమైందంటూ ఛలో ఆత్మకూరుకు పిలుపునిచ్చింది టీడీపీ. ఆత్మకూరు కేంద్రంగా ఓ వర్గంపై వైసీపీ జరిపిన దురాగతాలను ఎండగడదామని, బాధిత కుటుంబాలకు అండగా ఉందమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.

ఈ పరిస్థితుల్లో గుంటూరులో సమావేశమైన వైసీపీ నేతలు తాజా పరిస్థితులపై చర్చించారు. తాము కూడా చలో ఆత్మకూరు నిర్వహిస్తామని ప్రకటించారు. దీంతో ఒక్క సారిగా వాతావరణం వేడెక్కింది. చంద్రబాబు పిలుపుతో రాత్రికే గుంటూరు పునరావాస శిబిరం వద్దకు భారీగా చేరుకున్నారు టీడీపీ శ్రేణులు. వంద రోజుల్లో అధికార పార్టీ చేసిన అరాచకాల్ని ఎండగట్టేందుకు సిద్ధమయ్యారు ప్రతిపక్ష నేతలు. టీడీపీ, వైసీపీ పోటాపోటీగా చలో ఆత్మకూరుకు పిలుపునివ్వడంతో అప్రమత్తమైన పోలీసులు... ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. 144సెక్షన్‌ను అమలులోకి తెచ్చారు. గుంటూరులోని టీడీపీ పునరావాస శిబిరం చుట్టూ భారీగా బలగాలను మోహరించారు. ఇసుప కంచెలు వేసి... వాటర్ క్యానన్‌లను సిద్ధం చేశారు. ఆందోళనకారుల్ని నిలువరించేందుకు రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్సును కూడా రంగంలోకి దించారు పోలీసులు.