రేపటి నుంచి పదవ తరగతి పరీక్షలు

రేపటి నుంచి పదవ తరగతి పరీక్షలు

ఈ నెల 16 నుంచి ఏప్రిల్‌ 3 వరకు జరగనున్న పదోతరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తిచేశామని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ విజయ్‌కుమార్‌ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. పరీక్షలు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతాయని, 9:35 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 5,52,302 మంది విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు. హాల్‌టికెట్‌ చూపి, పరీక్ష కేంద్రాల వరకు అన్ని రకాల బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని, ఈ మేరకు ఆర్టీసీ అనుమతించిందని వెల్లడించారు. తొలుత నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్‌ 2తో పరీక్షలు ముగియాల్సి ఉందని, ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా ఈ నెల 22న జరగాల్సిన ఇంగ్లిష్‌ పేపర్‌-2 పరీక్షను ఏప్రిల్‌ 3న నిర్వహించనున్నట్లు వివరించారు. పరీక్షల సమయంలో విద్యుత్‌ కోతలు లేకుండా విద్యుత్‌శాఖను అప్రమత్తం చేశామన్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రతి పరీక్ష కేంద్రంలో ఒక ఏఎన్‌ఎం, ఆశా ఉద్యోగితో పాటు అవసరమైన మందులు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు సిద్ధంగా పెట్టామన్నారు. పరీక్షలు జరుగుతున్నంత వరకు చుట్టూ జిరాక్స్‌ దుకాణాలను మూసివేయిస్తామని, 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని తెలిపారు. విద్యార్థులహాల్‌టికెట్లు www.bse.telangana.gov.in వెబ్‌సైట్లో పొందుపరిచామని చెప్పారు. విద్యార్థులకు హాల్‌టికెట్లు అందకుంటే వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని పరీక్షలకు హాజరుకావచ్చన్నారు. ప్రభుత్వ గుర్తింపును పునరుద్ధరించకోని 340 పాఠశాలల్లోని విద్యార్థులను పరీక్షలకు అనుమతిస్తూ హాల్‌టికెట్లు ఇచ్చామన్నారు.