సెక్యూరిటీ గార్డును వివాహమాడిన 'థాయ్‌' రాజు

సెక్యూరిటీ గార్డును వివాహమాడిన 'థాయ్‌' రాజు

థాయ్‌లాండ్‌ రాజు మహా వజిరాలాంకోర్న్‌ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తన పర్సనల్ సెక్యురిటీ గార్డ్ విభాగంలో డిప్యూటీ అధిపతిగా పనిచేసే మహిళను ఆయన వివాహమాడారు. ఆపై ఆమె పేరును క్వీన్ సుతిదగా మార్చారు. ఈ విషయాన్ని వెల్లడించిన థాయ్ రాయల్ గెజిట్.. వారి పెళ్లి ఫొటోలను, వీడియోలను విడుదల చేసింది. థాయ్ మీడియాలో ఈ వార్త ప్రసారం కావడంతో  దేశ ప్రజలందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.

థాయ్‌లాండ్‌ రాజ్యాంగ బద్ధమైన చక్రవర్తిగా 70 ఏళ్లపాట సింహాసనం అధిష్టించిన తండ్రి భూమిబోల్‌ అదుల్‌యదెజ్‌ 2016 అక్టోబర్‌లో మరణించడంతో ఆయన వారసుడిగా కింగ్‌ రామX  పేరొందిన వజిరాలాంకోర్న్‌ పగ్గాలు చేపట్టారు. వచ్చే శనివారం బ్యాంకాక్‌లో బౌద్ధ, బ్రాహ్మణ సంప్రదాయ వేడుకల ప్రకారం ఆయన థాయ్‌లాండ్‌ రాజుగా పట్టాభిషేకం జరగనుంది. ఆ మరునాడు అధికారికంగా ఆయన రాజుగా ఊరేగింపులో పాల్గొంటారు.

కాగా గతంలో వజిరాలాంకోర్న్ కు మూడు వివాహాలు జరగగా.. ఏడుగురు సంతానం ఉన్నారు. ఆ ముగ్గురితోనూ ఆయన విడాకులు తీసుకున్నారు. మరోవైపు థాయ్ ఎయిర్‌వేస్‌లో ఫ్లయిట్ అటెండెంట్‌గా పనిచేస్తోన్న సుతిదను వజిరలోంగ్ 2014లో తన బాడీగార్డుల్లో డిప్యూటీ కమాండెంట్‌గా నియమించుకున్నారు. ఓ విమానంలో సుతిదను చూసి మనసుపడ్డ వజిరాలాంకోర్న్.. ఇప్పుడు ఆమెను మనువాడి తనదాన్ని చేసుకున్నాడు.