అందుకే ఏపీలో మందు రేట్ల తగ్గింపు.. !

అందుకే ఏపీలో మందు రేట్ల తగ్గింపు..  !

ఏపీలో మందు ధరలను ఈరోజు తగ్గించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మద్యం ధరల తగ్గింపు ఎస్ఈబీ నివేదిక ఆధారంగానేనని అంటున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రవాణాను అరికట్టేందుకు ఈ ధరల్ని తగ్గిస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. చీప్ లిక్కరుతో పాటు ప్రీమియం బ్రాండ్ల మద్యం తెలంగాణా నుంచి పెద్ద ఎత్తున స్మగ్లింగ్ అవుతుండటంతో ఈ ధరల్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు అబ్కారీ శాఖ తెలిపింది.

2020 సెప్టెంబరు 15 నుంచి అక్టోబరు 15 మధ్య కాలంలో పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణాకు సంబంధించి  1211 కేసులు నమోదు అయినట్టు వెల్లడించారు. తెలంగాణా నుంచి 630, కర్ణాటక నుంచి 546, ఒడిశా నుంచి 24, తమిళనాడు నుంచి 11 కేసులు నమోదైనట్టు ప్రభుత్వం పేర్కొంది. తెలంగాణా, కర్ణాటకల్లో మద్యం ఎమ్మార్పీ ధరలు ఏపీ కంటే రెండింతలు తక్కువ కావటంతోనే స్మగ్లింగ్ జరుగుతున్నట్టు ఎస్ఈబీ నివేదిక ఇచ్చింది. పొరుగు రాష్ట్రాల సరిహద్దులు పంచుకుంటున్న ఏపీ మండలాల్లో పెద్ద మొత్తంలో స్మగ్లింగ్ జరుగుతున్నట్టుగా ఎస్ఈబీ నివేదికలో పేర్కొంది.

 రూ. 50 నుంచి రూ. 1350 వరకూ వివిధ కేటగిరీల్లో మద్యం ధరల తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. మీడియం, ప్రీమియంలో 25 శాతం ధరలను తగ్గించింది. రేపట్నుంచే తగ్గించిన మద్యం ధరలు అమలు కానున్నాయి. బీర్లు, రెడీ టూ డ్రింక్ మద్యం ధరల్లో ఎలాంటి మార్పూ లేదని స్పష్టం చేసింది. రూ. 200 రూపాయల్లోపు క్వార్టర్ బాటిల్ ధరలపై మార్పు లేదని పేర్కొంది ప్రభుత్వం. రూ. 200 దాటిన క్వార్టర్ బాటిల్  ధరలను తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేసింది.