పరువు నష్టం కేసులు ఉపసంహరించనున్న అదానీ గ్రూప్!

పరువు నష్టం కేసులు ఉపసంహరించనున్న అదానీ గ్రూప్!

తమ సంస్థలకు వ్యతిరేకంగా వార్తాకథనాలు ప్రచురించి నష్టం కలిగిస్తున్నారని న్యూస్ పోర్టల్ thewire.in, దాని సంపాదకులపై ఒక అహ్మదాబాద్ కోర్టులో వేసిన అన్ని పరువు నష్టం దావాలను ఉపసంహరించేందుకు అదానీ గ్రూప్ నిర్ణయించింది. ఈ విషయం అత్యంత విశ్వసనీయ వర్గాల తెలిసినట్టు ఐఏఎన్ఎస్ వార్తాసంస్థ తెలిపింది. అదానీ గ్రూప్ వ్యాపారాలపై కొన్నేళ్లుగా ద వైర్ పలు వార్తలు ప్రచురించింది. దీంతో అదానీ గ్రూప్ ద వైర్ పై అనేక సివిల్, క్రిమినల్ పరువు నష్టం కేసులు పెట్టింది. అయితే అదానీ గ్రూప్ కేసుల ఉపసంహరణ ప్రక్రియ తుది దశకు చేరలేదు. 

నిన్న ఏడీఏజీ చైర్మన్ అనిల్ అంబానీ కూడా కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ యాజమాన్యంలో నడిచే నేషనల్ హెరాల్డ్ పత్రికపై పెట్టిన పలు పరువు నష్టం దావా కేసులను ఉపసంహరించుకుంటున్నట్టు తెలిసింది. ఎగ్జిట్ పోల్ ఫలితాలన్నీ మరోసారి కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పడుతుందని బల్లగుద్ది చెబుతున్న తరుణంలో నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితులుగా చెప్పుకొనే అంబానీ, అదానీలు తమ పరువు నష్టం దావాలను ఉపసంహరించుకోవడం పలు సందేహాలను రేకెత్తిస్తోంది.