హిట్లర్ కారు కనుమరుగు

హిట్లర్ కారు కనుమరుగు

కాలం గడుస్తున్నకొద్దీ అనేక చరిత్ర పుటలు కాలగర్భంలో కలిసిపోతాయి. అలాంటిదే ఫోక్స్ వ్యాగన్ కంపెనీ బీటెల్ కారు కూడా. ఎంతో చారిత్రక నేపథ్యం కలిగి, ఎంతో మంది సెంటిమెంట్స్ ను ప్రభావితం చేసిన ఏడు దశాబ్దాల బీటెల్ కారు... 2019 జులై నుంచి ఇక శాశ్వతంగా కనుమరుగు కానుంది. ప్రపంచంలో ఫ్యాషన్ కార్ల తొలిప్రయోగంగా ఫోక్స్ వ్యాగన్ కు చెందిన బీటెల్ కారును అంతా చెప్పుకుంటారు. 1934లోనే జర్మనీ దేశపు నాజీ నియంత అడాల్ఫ్ హిట్లర్... ఓ వినూత్నమైన, ప్రజలందరూ ఇష్టపడే "పీపుల్స్ కారు"ను రూపొందించాలని ఫెర్డినాండ్ పోర్ష్ ను ఆదేశించాడని చరిత్ర చెబుతోంది. హిట్లర్ ఆదేశాలతో పని మొదలుపెట్టిన ఫెర్డినాండ్ 1937లో పని ప్రారంభించాడు. పీపుల్స్ కారునే జర్మనీలో ఫోక్స్ వ్యాగన్ అంటారు. అదే పేరుతో కంపెనీకి హిట్లర్ శంకుస్థాపన చేశాడు. అలా ఫోక్స్ వ్యాగన్ కంపెనీ మూడో తరం ప్రజల్ని కూడా విపరీతంగా ఆకట్టుకుంటోంది. 

అయితే 1960లో వింతైన ఆకారంతో వినూత్నమైన మోడల్ గా ప్రపంచానికి పరిచయమైన బీటెల్ మోడల్ కారు.. ఇక శాశ్వతంగా కనుమరుగు కానుంది. అప్పటికి మార్కెట్లో ఉన్న కార్లన్నిటికన్నా.. బీటెల్ కారు ఒక బగ్ ను పోలిన ఆకారంలో ఉండడంతో ప్రజలందరినీ ఆకర్షించింది. 1968లో వచ్చిన "ద లవ్ బగ్" సినిమాలో కనిపించి అలరించింది. ఆనాటి చాలా సినిమాల్లో బీటెల్ అనేది ఒక ట్రెండ్ అన్న టాక్ ను సంపాదించుకుంది. అయితే నాజీల మూలాలు ఉన్నందున అమెరికాలోమాత్రం 1950 వరకు బీటెల్ పెద్దగా పాపులర్ కాలేదు. ఆ తరువాత 60, 70ల్లో అమెరికా మార్కెట్లో బాగా పుంజుకుంది. దాని ఎదుగుదల అమెరికన్ కార్ల కంపెనీలకు ఇబ్బందికరంగా మారడంతో 1979లో బీటెల్ ను సీజ్ చేయాల్సి వచ్చింది. అంతగా పాపులరైన బీటెల్ 1990ల్లో మళ్లీ దూసుకొచ్చి 2012 లో న్యూ బీటెల్.. పేరుతో అప్ డేట్ అయింది. 

మూతపడటానికి కారణమేంటి?
ఫోక్స్ వ్యాగన్ కు చెందిన అమెరికన్ బ్రాంచ్... ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీపై ఫోకస్ చేస్తోంది. దాంతోపాటు ముఖ్యంగా ఫ్యామిలీ ఓరియెంటెడ్ కార్లవైపు దృష్టి సారించడంతో బీటెల్ ఉనికికి ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు 2015లో బయటపడిన డీజిల్ గేట్ కుంభకోణం నుంచి బయటపడేందుకు ఫోక్స్ వ్యాగన్.. భారీ ఎత్తున చమురు విదిలించుకోవాల్సి వచ్చింది. కంపెనీలోని ఇతర వెర్షన్లయిన జెట్టా, పసాట్ ల కన్నా అమ్మకాలు బాగా పడిపోయాయి. ఇలా అనేక కారణాల వల్ల బీటెల్ ఇక శాశ్వతంగా కనుమరుగవడం ఖాయంగా మారింది. 

అయితే ఆ కంపెనీ అమెరికన్ బ్రాంచ్ సీఈవో హిన్రిచ్ మాత్రం బీటెల్ మూసివేత విషయాన్ని ప్రకటించేందుకు అంతగా ఇష్టపడటం లేదు. వాస్తవానికి ఫోక్స్ వ్యాగన్ బస్ ను తీసుకురావాలన్న నిర్ణయం 2017లోనే జరిగిందని.. అయినప్పటికీ బీటెల్ భవిష్యత్తులో రాదని చెప్పలేమని వ్యాఖ్యానించారు. అయితే దీని మూసివేత అనేది.. చాలా ఫోర్ వీలర్లకు టర్నింగ్ పాయింట్ అవుతుందని సమర్థించుకోవడం విశేషం.