కరోనా కోసం పెళ్లి వాయిదా వేసుకున్న వైద్యుడు మృతి

కరోనా కోసం పెళ్లి వాయిదా వేసుకున్న వైద్యుడు మృతి

 
కరోనా వైరస్ భీభత్సం చైనాలో దారుణంగా ఉంది. మహమ్మారి భరతం పడదామని రంగంలో దిగిన వైద్యులు సైతం దాని బారిన పడి మరణిస్తున్నారు. వైరస్‌ను కనుగున్న డాక్టర్ పది రోజుల క్రితమే చనిపోగా.. ప్రస్తుతం చికిత్స అందించడంకోసం పెళ్లినే వాయిదా వేసుకున్న ఓ యువ వైద్యుడు మరణించాడు. దీంతో వైరస్ సోకి ప్రాణాలు విడిచిన డాక్టర్ల సంఖ్య ఆ దేశంలో 8కి చేరుకుంది. కోవిడ్-19 వ్యాది సోకి ఓ యువ వైద్యుడు చనిపోయిన ఘటన చైనాలో విషాదం నింపుతోంది. పెంగ్ యున్హూవా అనే 29 ఏళ్ల డాక్టర్ కరోనా వ్యాదిగ్రస్తులకు చికిత్స అందించడానికి గతంలో పెళ్లిని వాయిదా వేసుకున్నాడు. చైనా నూతన సంవత్సరం రోజున పెంగ్ మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది. అయితే పెళ్లి కుదిరిన తర్వాత దేశంలో కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా ఉండడంతో చికిత్స అందించడం కోసం పెళ్లిని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నాడు పెంగ్.

వుహాన్‌లోని పీపుల్ ఆసుపత్రిలోని ఒకటవ విభాగంలో పెంగ్ వైద్య సేవలు అందిస్తుండేవాడు. శ్వాసకోశ విభాగానికి చెందిన వైద్యుడు కావడంతో అనేక మందికి విరామం లేకుండా చికిత్స అందించాడు పెంగ్. ఆ ప్రక్రియలోనే జనవరి 25న పెంగ్‌కు కరోనా సోకింది. అప్పటి నుంచి ఆయన అక్కడే చికిత్స పొందుతున్నాడు. ఆయన పరిస్థితి మరింత విషమించడంతో శనివారం అతను మృతి చెందినట్టు ప్రకటించింది చైనా వైద్యశాఖ. పెళ్లి వాయిదా పడిన విషయం తెలుసు కానీ, అది ఎప్పటికి వాయిదా పడిందో మాత్రం పెంగ్‌కు తెలియదు. వాయిదా పడిన పెళ్లి డేట్ పెంగ్‌కు పంపాలనుకున్నా చికిత్సలో ఉండడం కారణంగా పెంగ్ దాన్ని అందుకోలేదు. ఆ పెళ్లి కార్డు ఇంకా పెంగ్ టెబుల్‌పైనే ఉందని ఆవేదనతో తెలిపారు ఆయన కుటుంబసభ్యులు.

కరోనా వైరస్‌పై పోరాడడానికి వివాహాన్ని సైతం వాయిదా వేసుకుని ముందువరుసలో నిలబడ్డ వైద్యుడు మృతి చెందాడనే వార్త తెలియడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చైనా ప్రజలు. అతను రియల్ హీరో అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అతడిని చైనా దేశం ఉన్నంతవరకు మరిచిపోదంటూ ప్రసంశలు కురిపిస్తున్నారు. కాగా, చైనాలో ఇప్పటి వరకు 1,700 మంది ఆరోగ్య శాఖ సిబ్బందికి కరోనా సోకింది. వారిలో ఇప్పటివరకూ 8 మంది చనిపోయారు. మిగిలిన వారికి చికిత్స అందిస్తున్నట్టు ప్రకటించింది చైనా వైద్య ఆరోగ్యశాఖ.