పంద్రాగస్ట్ పండుగకు జపానే కారణం

పంద్రాగస్ట్ పండుగకు జపానే కారణం

భారతదేశానికి ఆగస్ట్ 15, 1947న స్వాతంత్ర్యం వచ్చింది. ప్రపంచంలోని ఐదో వంతు జనాభా వలస పాలన నుంచి విముక్తులయ్యారు. రవి అస్తమించని బ్రిటన్ చక్రవర్తి పరిపాలనకు తెరపడింది. సాతంత్ర్య ఉద్యమం గురించి, స్వాతంత్ర దినోత్సవం గురించి ఇప్పటి వరకు ఎందరో రీముల కొద్దీ రాశారు. కానీ ఆగస్ట్ 15న మనం దక్షిణ కొరియాతో కలిసి ఎందుకు స్వాతంత్ర్య దినం జరుపుకుంటామో మీకు తెలుసా? ఈ రెండు దేశాల స్వాతంత్ర్య దినోత్సవానికి జపాన్ కారణమని ఎందరికి తెలుసు. కానీ ఇది నమ్మలేని నిజం.

చరిత్రకారులు మనకు స్వాతంత్ర్యం వచ్చిందని సంబరపడుతూ వందలాది పుటల పుస్తకాలు రాశారే తప్ప ఎలాంటి అరాచక పరిస్థితుల్లో స్వాతంత్ర్యం వచ్చిందో రాయలేదు. 200 ఏళ్లకు పైగా నయానో భయానో భారత్ పై పెత్తనం సాగించిన బ్రిటన్, రెండో ప్రపంచ యుద్ధంతో చితికి పోయింది. వీలైనంత త్వరగా భారత్ వదిలి వెళ్లిపోవాలని భావించింది. అయితే అధికారాల బదలాయింపు తేదీలు నిర్ణయించింది ఎలాగో తెలిస్తే రక్తం మరిగిపోవడం ఖాయం. 

చివరి బ్రిటిష్ వైశ్రాయ్, లార్డ్ మౌంట్ బ్యాటన్ ను బ్రిటన్ లో ఎందుకు ఆగస్ట్ 15న భారతీయులకు అధికారాలు బదలాయించారని అడిగితే ‘ అది అనుకోకుండా నాకు తట్టింది. ఒక ప్రశ్నకు సమాధానంగా నేను అలా చెప్పాను. ఈ వ్యవహారంలో నాదే తుది నిర్ణయం అని చెప్పాలని భావించాను. వాళ్లు నన్ను ఏదైనా తేదీ అనుకున్నారా అని అడిగారు. అది త్వరలోనే అని నాకు తెలుసు. కానీ అప్పటికి ఏ రోజో నిర్ణయించుకోలేదు. ఆగస్టా..సెప్టెంబరా అని ఆలోచించాను. వాటిలో ఆగస్ట్ 15ని ఎంచుకున్నాను. ఎందుకంటే ఆ రోజున జపాన్ లొంగుబాటుకి రెండో వార్షికోత్సం’ అని సమాధానం ఇచ్చాడు.

రెండు అణుబాంబుల కారణంగా భారీ ప్రాణనష్టం, ఆస్తినష్టం చవిచూసిన జపాన్.. ఆగస్ట్ 15, 1945న లొంగిపోతున్నట్టు ప్రకటించింది. అప్పుడు ఆగ్నేయాసియా కమాండ్ కి సంకీర్ణ దళాల సుప్రీం కమాండర్ గా ఉన్న మౌంట్ బ్యాటన్ సింగపూర్ లో జపాన్ లొంగుబాటుని స్వయంగా స్వీకరించాడు. దీంతో తన ఘనతను చాటుకొనే ఆ రోజునే భారత స్వాతంత్ర్యానికి ముహూర్తంగా నిర్ణయించాడు. అప్పటికి జపాన్ వలస పాలన కింద మగ్గుతున్న దక్షిణ కొరియాకి కూడా అదే రోజున స్వాతంత్ర్యం వచ్చింది. అందువల్ల భారత్, దక్షిణ కొరియాలు రెండూ ఒకేరోజు ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటాయి. రెండిటి స్వాతంత్ర్యానికి కారణం కూడా జపాన్ లొంగుబాటే కావడం విశేషం.