మధ్యప్రదేశ్ లో దారుణం... మూఢనమ్మకాలతో భార్య తల నరికిన భర్త

మధ్యప్రదేశ్ లో దారుణం... మూఢనమ్మకాలతో భార్య తల నరికిన భర్త

ఆధునిక యుగంలో కూడా మూఢనమ్మకాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. దేవత ప్రసన్నం కోసం పూజలు చేస్తూ ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. నరబలి ఇస్తే సిరి సంపదలు కలుగుతాయని భావించిన అతగాడు తాను నమ్మిన దేవతకు భార్య తల నరికి బలిచ్చాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని సింగ్రోలీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే...  50ఏళ్ల వ్యక్తికి విపరీతమైన భక్తి. అంతేకాదు మూఢనమ్మకాలంటే పిచ్చి. ఇటీవలి కాలంలో అతను ఓ దేవతను నమ్మి ఆమెకు బలులు ఇస్తే తనకు సిరిసంపదలు కలుగుతాయని నమ్మకం పెంచుకున్నాడు. ఇటీవలే ఓ మేకను బలిచ్చి దాని కళేబరాన్ని పూజగదిలోనే పూడ్చిపెట్టాడు.

అయితే తాను నమ్ముతున్న దేవత ప్రసన్నం కోసం ఏకంగా తన భార్యను బలివ్వాలనుకున్నాడు. అంతే పూజలో కూర్చున్న అతగాడు ఒక్కసారిగా తన భార్య తల నరికేశాడు. అనంతరం శరీరాన్ని ముక్కలుముక్కలుగా నరికాడు. అనంతరం ఆమె తలను దేవత దగ్గర పెట్టి పూజలు చేశాడు. తర్వాత తలను, మెుండాన్ని వేర్వేరుగా పూజగదిలోనే పూడ్చిపెట్టాడు. అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన అతడి ఇద్దరు కుమారులు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి ముక్కులు ముక్కలుగా పాతిపెట్టిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని గురువారం అరెస్టు చేశారు.