నోకియా 3310.. ఆల్‌టైమ్‌ పాపులర్‌..

నోకియా 3310.. ఆల్‌టైమ్‌ పాపులర్‌..

నోకియా 3310.. ప‌రిచ‌యం అక్కర్లేని మొబైల్ ఫోన్ ఇది. మ‌ధ్య త‌ర‌గ‌తి ప్రజలకు కూడా మొబైల్‌ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన రోజుల్లో వారికి ఈ ఫోన్‌ను మించిన చాయిస్‌ లేదు. సింపుల్ డిజైన్‌, రోజుల త‌ర‌బ‌డి వ‌చ్చే బ్యాట‌రీ, చేతిలో ఇట్టే ఇమిడిపోవడం ఈ ఫోన్‌ ప్రత్యేకత. స్నేక్‌ గేమ్‌  ఇందులో ప్రధానాకర్షణ. ఈ ఫోన్‌ను నోకియా లాంచ్‌ చేసి సరిగ్గా 18 సంవత్సరాలైంది. పదుల సంఖ్యలోని మోడళ్లను నోకియా లాంచ్‌ చేసినా.. ఇప్పటికీ ఇదే ఆల్‌టైమ్‌ పాపులర్‌. మొత్తం 12.6 కోట్ల 3310 మోడ‌ల్ హ్యాండ్‌ సెట్లను గతంలో నోకియా విక్రయించందంటే.. ఈ ఫోన్ల ప్రత్యేకత ఏంటో చెప్పవచ్చు.  

అందుకే ఈ క్రేజ్‌.. 
కంఫర్టబుల్‌.. బ్యాటరీలైఫ్‌.. యూజర్‌ ఫ్రెండ్లీ.. నోకియా 3310 ఫోన్‌ మదిలో మెదలగానే ఈ మూడూ గుర్తొస్తాయి. పిల్లలు, ముఖ్యంగా పెద్దలకు నోకియా 3310 ఫోన్‌తో కాల్స్‌ చేసుకోవటం, మెసేజ్‌లు చూడటం సులుభం. ఒక్కసారి బ్యాటరీ ఛార్జింగ్‌ పెడితే వారం దాకా మాట్లాడుకోవచ్చు. బాగా కాల్స్‌చేసే వ్యక్తులకైనా రెండు మూడు రోజులకోసారి ఛార్జింగ్‌ చేసుకుంటే సరిపోతుంది. ఎన్నేళ్లు వాడినా ఈ ఫోన్‌ బోర్‌ కొట్టదు. ఈ మోడల్‌కి ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని.. గతేడాది 4జీ వెర్షన్‌ను లాంచ్‌ చేసింది. సేమ్‌ సీన్‌ రిపీటైంది. ఈ మోడల్‌ కూడా హాట్‌ కేకుల్లా అమ్ముడైంది


కింద పడినా పగలదా?
ఇప్పుడు మనం ఖరీదైన స్మార్ట్‌ ఫోన్లు కొంటున్నాం. కానీ ఆ ఫోన్‌ జేబులో ఉంటే ఏదో తెలియని భయం. కొన్నిసార్లు వాటంతటవే రీస్టార్ట్‌ అవుతుంటాయి. మన ప్రమేయం లేకుండానే మెసేజులు, కాల్స్‌ వెళ్లిపోతుంటాయి. ఫోన్‌ ఏ మాత్రం కిందపడినా స్క్రీన్‌ పగలడం ఖాయం. ఆ  టచ్‌ స్ర్కీన్‌ వేయించాలంటే.. ఫోన్‌ ఖరీదు కంటే అధికం! .. ఇక.. నోకియా 3310 ఫోన్‌ విషయానికి వస్తే.. ఇది కిందపడినా పగలదా? అంటే.. పగులుతుంది! కానీ ఫోన్‌ కాదు.. ఫ్లోర్‌! కావాలంటే ఈ ఫొటో చూడండి. ఇది నిజం కాకపోయినా.. ఈ ఫోన్‌ కిందపడినా చెక్కుచెదరదనేది మాత్రం నిజం..


టెర్మినేటర్‌ ఫోన్‌..
నోకియా 3310పై అప్పట్లో చాలా జోకులు పేలేవి. బుల్లెట్‌తో కాల్చినా ఈ ఫోన్‌ ముక్కలవదని.. బుల్లెట్ మాత్రం ముక్కలవుతుందని సెటైర్లు వేసేవారు. లార్డ్‌ ఆఫ్‌ ద రింగ్స్‌లో హీరో ఆయుధం కంటే ఈ ఫోనే బలమైన వెపన్‌  అని మరికొంతమంది అనేవారు. మొన్నామధ్య రీలాంచ్‌  సమయంలో కూడా నెటిజన్లు ఈ ఫోన్‌ను ట్రోల్‌  చేశారు. అమ్మాయిలకు పెప్పర్‌ స్పే అక్కర్లేదని.. ఈ ఫోనే రక్షణ అని ట్వీట్లు చేశారు.