నైరుతి రుతుపవనాలు మరింత ఆలస్యం..!

నైరుతి రుతుపవనాలు మరింత ఆలస్యం..!

మృగశిర కార్తె వచ్చేసింది.. రెయిన్ సీజన్‌కు మృగశిర కార్తె ఆరంభంగా చెప్పుకుంటారు.. కానీ, ఇప్పటి వరకు రుతుపవనాల జాడలేదు. ఈ నెల మొదటివారంలోనే నైరుతి రుతుపవనాలు వస్తాయని మొదట అంచనా వేసినా.. ఇప్పుడు రెండో వారం పూర్తి అయితేనే కానీ, తెలంగాణకు నైరుతి రుతుపవనాలు వచ్చేలా లేవంటున్నారు. ఇక, జూన్‌ 1వ తేదీన కేరళను తాకాల్సిన రుతు పవనాలు జూన్‌ 8న ప్రవేశించాయి. సోమవారంనాటికి దక్షిణ అరేబియా సముద్రం, లక్షదీవుల ప్రాంతాలకు పూర్తిగా, కేరళలోని చాలా ప్రాంతాలకు, తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. తెలంగాణలోకి 11వ తేదీకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తొలుత ప్రకటించారు. కానీ, అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం ఉదయానికి వాయుగుండంగా మారింది. ఇది ఉత్తర వాయవ్య దిశగా (పాకిస్థాన్‌ వైపు) కదులుతోంది. దీంతో మరింత  జాప్యం జరుగుతుందంటున్నారు.

కాగా, ఈ నెల 13వ తేదీన దక్షిణ కోస్తాంధ్రలోకి నైరుతి ప్రవేశించే పరిస్థితులు కనిపిస్తున్నాయని, ఆ తర్వాత రెండు రోజులకు తెలంగాణలో రుతుపవనాలు ప్రవేశిస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. నైరుతి ఆలస్యం అవుతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కాగా, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇంకా వడగాడ్పులు వీస్తున్నాయి. మృగశిర కార్తెకు ముందు వాతావరణం చల్లబడినా.. ఆ వెంటనే మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. రెయిన్ సీజన్ ప్రారంభం కావాల్సి ఉన్నా.. ఇంకా ఎండలు మండిపోతూనే ఉన్నాయి.