తెలకపల్లి రవి : స్థానిక ఎన్నికలకు ఆమోదం, ముగించడమే శ్రేయస్కరం

తెలకపల్లి రవి : స్థానిక ఎన్నికలకు ఆమోదం, ముగించడమే శ్రేయస్కరం

ఆంధ్రప్రదేశ్‌లో జడ్‌పిటిసి, ఎంపిటిసి ఎన్నికకు సంబంధించిన పోలింగ్‌ రేపు జరగవసి ఉండగా హైకోర్టు  ఏకసభ్య బెంచి నిన్న స్టే ఇచ్చింది. ఈ రోజు విస్తృత ధర్మాసనం అనుమతించింది. పోలింగ్‌కు నెల రోజు ముందు నుంచే కోడ్‌ అమలులో వుండాలన్న సుప్రీం కోర్టు ఆదేశాన్ని కొత్త ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని పాటించలేదన్న అభ్యంతరంతో టిడిపి నేత వర్ల రామయ్య కోర్టుకు వెళ్లారు. దీనిపై మొదట స్టే రాగానే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రాజ్యాంగ విజయం అన్నారు. మరికొన్ని పార్టీ నాయకులు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.

అయితే ఎస్‌ఇసి ఈ స్టేపై హైకోర్టులో హౌస్‌ మోషన్‌ తీసుకువచ్చిన ఫలితంగా ఈరోజు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం ఈ తీర్పు నిచ్చింది. ఇప్పటికే దీనిపై సుప్రీం కోర్టుకు వెళతానని రామయ్య ప్రకటించారు గాని ఆ అవకాశం పెద్దగా ఉండకపోవచ్చు. సాధారణంగా ఎన్నిక ప్రక్రియ మొదలైన తర్వాత న్యాయస్థానాలు జోక్యం చేసుకోవు.  ఇప్పటికే అన్ని సన్నాహాలు జరిగి,  ఎన్నికల సిబ్బంది కూడా బయలుదేరిన పరిస్థితుల్లో సుప్రీం కోర్టు జోక్యం చేసుకుంటుందా అనేది అనుమానమే. గత ఏడాది నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఎస్‌ఇసిగా ఇచ్చిన నోటిఫికేషన్‌నే ఇప్పుడు  కొనసాగించడంపై కోర్టు ఆమోదం తెల్పింది. ఆ కోణంలో జనసేన, బిజెపిలు వేసిన పిటిషన్‌లోతీర్పు రిజర్వు చేయబడిరది. అయిత తాజాతీర్పు నేపథ్యంలో రేపు పోలింగ్‌ జరిగిపోతే ఆ కేసుకు కూడా పెద్ద ప్రాధాన్యత ఉండదు.

విశేషమేమంటే ఈ కేసు వేసిన టిడిపి జెడ్‌పి ఎన్నికల్లో పాల్గొనకుండా బహిష్కరించాని నిర్ణయించింది. నీలం సాహ్ని ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారు గనకనే పక్షపాతంతో జరిగే ఎన్నికలలో పాల్గొనబోమన్నది టీడీపీ వైఖరి. ఇప్పుడు కూడా దాంట్లో మార్పు ఉండదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ బహిష్కరణ నిర్ణయంపై ఆ పార్టీలో తీవ్ర నిరసనలు అసమ్మతి రాజీనామాలు కూడా జరిగాయి. మరో వంక స్థానికంగా అత్యధిక చోట్ల ఆ పార్టీ వారు ఎన్నికల ప్రచారం సాగించారు. కనుక ఈ బహిష్కరణ ప్రకటన వ్యూహాత్మకంగా చేసిందనే అనుకోవాల్సి ఉంటుంది. ఎలాగూ పాల్గొనని పార్టీకి ఎన్నికలు ఎప్పుడు జరిగినా పెద్ద ప్రమేయం ఉండదు. కాని నిమ్మగడ్డ హయాంలో మొదలైన వివాదం నీలం సాహ్నీ హయాంలోనూ కొనసాగాన్నఉద్దేశంతో  ఇన్ని కేసు వస్తున్నాయనుకోవాలి.

ఆమె కూడా అఖిపక్షం తర్వాత ఎన్నిక తేదీలు ప్రకటించి వుంటే బావుండేదన్న అభిప్రాయం వున్నా రాగానే రాజకీయ పక్షపాతం ఆపాదించడం వాస్తవికంగా అనిపించదు. పైగా గత ఏడాది మార్చిలో మొదలైన ఈ ఎన్నిక ప్రహసనం ఎక్కడో ఒక చోట ముగియక తప్పదు. ముగించకా తప్పదు. మొత్తం దృష్టి దీనిపై కేంద్రీకరించి పార్టీలు కీచులాడు కుంటుంటే పాలనా వ్యవస్థనే స్తంభించిపోయిన పరిస్థితి. దానికి తోడు కోవిడ్‌ వ్యాప్తి కూడా మరోసారి మొదలైన పరిస్థితి. ప్రతిపక్షాకు ఎలాగూ నామమాత్రంగానే స్థానాలు వస్తాయిన పంచాయతీ మున్సిపల్‌ ఎన్నికతో తేలిపోయింది. అలాటప్పుడు పూర్తి చేసి ఇతర సమస్యలపై ఉద్యమించే బదులు ఆ ఎన్నికనే సాగదీస్తూ కూచోవడంలో  ఔచిత్యం కనిపించదు. సుప్రీం కోర్టు కూడా పిటిషన్‌ అనుమతిస్తే బహుశా ఆ వైఖరినే తీసుకోవచ్చు.అదే మంచిది కూడా. టిడిపి బహిష్కరణ నినాదం ఎలాగూ చాలా చోట్ల అమలు జరగదు కనుక పోటీ వుండనే వుంటాయి.

ఇక్కడ కనిపించని అదృశ్య పాత్ర నిమ్మగడ్డదే కావడం మరో విశేషం, చాలా రోజుగా కోడ్‌ అములోనే వుంది. గతంలో ఆగిపోయిన ఈ ఎన్నికను ముందు నిర్వహించే బదు ఆయన మునిసిపల్‌ ఎన్నికకు వెళ్లారు. ఆ వెంటనే మార్చి 19న కోడ్‌ ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు. వాస్తవంలో  ఈ ఎన్నికపై ఇంకా నిర్ణయం తీసుకుని స్థితిలో ఆ రోజున ఆ ప్రకటన చేయాల్సిన అవసరం లేదు, దాని పర్యవసానాలు తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగానే నిమ్మగడ్డ ఆ పనిచేశారనుకోవాలి. ఇప్పుడు ఆ అంశమీదనే టీడీపీ నేత కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుని ఒకరోజు మాత్రం ఉత్కంఠ సృష్టించగలిగారు. విస్త్రత ధర్మాసనం తీర్పుతో అది తొలగిపోవడం స్వాగతించదగిన పరిణామం.