ఒక్క హిట్ కావాలి..!!
విజయమే కొలమానం. విజయాలు ఉంటేనే మార్కెట్ ఉంటుంది. ఒకటి రెండు సినిమాలు ఫట్ అంటే మార్కెట్ పడిపోతుంది. తిరిగి నిలదొక్కుకోవడానికి చాలా కష్టమౌతుంది. అది హీరో కావొచ్చు, దర్శకుడు కావొచ్చు. ఒకప్పుడు వరస హిట్స్ ఇచ్చిన దర్శకులు ఇప్పుడు వరస పరాజయాలతో సతమతమౌతున్నారు. ఒక్క హిట్ కోసం పరితపించిపోతున్నారు.
ముఖ్యంగా ఐదుగురు దర్శకులు హిట్ కోసం తెగ ప్రయత్నం చేస్తున్నారు. వారిలో మొదట వరసలో ఉన్న వ్యక్తి శ్రీను వైట్ల. ఒకప్పుడు శ్రీను వైట్ల మంచి హిట్ సినిమాలు తీశాడు. సినిమా కథలు ఒకే ఫార్మాట్ లో ఉండటంతో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతున్నాయి. ఆగడు, మిస్టర్, బ్రూస్ లీ సినిమాలు భారీ పరాజయం పాలయ్యాయి. దీంతో శ్రీను వైట్ల రేస్ లో వెనకబడిపోయారు. ప్రస్తుతం రవితేజతో అమర్ అక్బర్ ఆంటోని సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఫలితంపైనే శ్రీను వైట్ల భవిష్యత్తు ఆధారపడి ఉంది.
స్టార్ హీరోలందరితో సినిమాలు చేసి హిట్ దర్శకుడు అనిపించుకున్న వివి వినాయక్ రేసులో వెనకబడిపోయాడు. ఖైదీ నెంబర్ 150 హిట్ అయినా.. ఆ క్రెడిట్ మొత్తం చిరు ఖాతాలోకి వెళ్ళింది. ప్రస్తుతం వినాయక్ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. మరి వినాయక్ హిట్ ఎప్పుడు కొడతాడో చూడాలి.
వినూత్న సినిమాలు తీస్తూ అందరిని ఆశ్చర్యపరిచిన దర్శకుడు విక్రమ్ కుమార్. మనం వంటి మంచి హిట్ ఇచ్చిన ఈ దర్శకుడు హలో యావరేజ్ కావడంతో మంచి హిట్ కోసం తాపత్రయ పడుతున్నాడు. బన్నీ కోసం కథను సిద్ధం చేసే పనిలో ఉన్నాడు ఈ దర్శకుడు.
త్రివిక్రమ్ సినిమాలకు టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉన్నది. కథలో లేకపోయినా.. ఆకట్టుకునే కథనాలు, మాటలతో మాయజేసి సినిమా హిట్ కొట్టడంలో త్రివిక్రమ్ దిట్ట. ఇదే ఫార్మాట్ తో పవన్ తో అజ్ఞాతవాసి చేశాడు. ఆ సినిమా దారుణ పరాజయం పాలయ్యింది. బయ్యర్లకు చేదు అనుభవం మిగిల్చింది. త్రివిక్రమ్ కెరీర్లోనే భారీ పరాజయం కావడంతో .. దీని నుంచి బయటపడేందుకు ఎన్టీఆర్ తో అరవింద సమేత వీర రాఘవ అనే సినిమా చేస్తున్నాడు. టైటిల్ తో మ్యాజిక్ చేసిన త్రివిక్రమ్ మరి సినిమాలో ఎలాంటి మ్యాజిక్ లు చేస్తాడో చూడాలి.
పూరికి ఒకప్పుడు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. తక్కువ సమయంలో భారీ సినిమాలు చేసేవాడు. పోకిరి, బిజినెస్ మెన్ సినిమాలు అందుకు ఉదాహరణ. ఈ రెండు ఎలాంటి సంచలనం సృష్టించాయో చెప్పక్కరలేదు. అయితే, తనకు అచ్చోచ్చిన మాఫియా బ్యాక్ డ్రాప్ కథలను ఎంచుకొని సినిమాలు చేస్తున్నాడు. ఎన్టీఆర్ తో టెంపర్ తరువాత పాపం ఒక్క హిట్ కూడా లేదు. మూస పద్దతి నుంచి బయటకు వచ్చి కొడుకు ఆకాష్ తో మెహబూబా సినిమా చేసినప్పటికీ లాభంలేకపోయింది.
ఇక ఫైనల్ గా చెప్పుకోవలసిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. కొత్త బంగారు లోకం సినిమాతో మంచి హిట్ ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాల.. మహేష్, వెంకటేష్ తో సీతమ్మ వాకిట్లో సినిమాల్లే చెట్టు వంటి మెగా హిట్ ఇచ్చాడు. ఆ తరువాత మహేష్ బాబుతో చేసిన బ్రహ్మోత్సవం భారీ ప్లాప్ అయింది. ప్లాప్ నుంచి బయటపడేందుకు శ్రీకాంత్ అడ్డాల చిన్న హీరోలతో సినిమా చేసేందుకు సిద్దమవుతున్నాడు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)