ఏటీఎం ధ్వంసం చేయకుండా రూ.26లక్షలు చోరీ

ఏటీఎం ధ్వంసం చేయకుండా రూ.26లక్షలు చోరీ

దేశరాజధానిలో జరిగిన ఓ ఏటీఏం చోరీ ఘటన పోలీసులకు దిమ్మదిరిగేలా చేసింది. కనీసం ఏటీఎంను పగలగొట్టడం కానీ గ్యాస్ కట్టర్ తో కట్ చేయడంగానీ చేయకుండా అందులోని రూ. 26లక్షలను ఎత్తుకెళ్లారు. ఢిల్లీలోని సీలంపూర్‌ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది.

ఏటీఎంలో నగదు నింపే బాక్స్‌ పాస్‌వర్డ్‌ తెలుసుకుని క్యాష్ బాక్స్ నుంచి రూ.26లక్షలు దొంగిలించినట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చోరీ జరిగిన క్రమం చూసి పోలీసులు కంగుతిన్నారు. ఏటీఎం మిషన్ ను పగులగొట్టకుండా, ఏ చిన్న గీత పడకుండా లక్షల రూపాయలు ఎలా దోచుకున్నారో తెలియక పోలీసులు జుట్టు పీక్కున్నారు.

డబ్బు చోరీ ఘటనలో బ్యాంకు ఉద్యోగుల ప్రమేయం పై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా విచారణను చేపట్టారు. ఏటీఎంలో నగదు నింపే ఉద్యోగుల వివరాలను సేకరిస్తున్నారు. ఏటీఎం క్యాష్‌బాక్స్ పాస్‌వర్డ్ దానిని నింపే వారికి మాత్రమే తెలిసి ఉంటుందని, బయటి వారికి తెలిసే అవకాశమే లేదని చెబుతున్నారు.