ఈ కాంబినేషన్‌తో మోడీకి మూడుతుంది!

ఈ కాంబినేషన్‌తో మోడీకి మూడుతుంది!

కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జి ట్వీట్‌ చేస్తూ.. కాంగ్రెస్‌, జేడీఎస్‌ల మధ్య ఎన్నికల పొత్తు కుదిరి ఉంటే చాలా మార్పు ఉండేదని అన్నారు. ఆమె ట్వీట్‌ అక్షర సత్యమన్నది అసెంబ్లీ ఎన్నికల డేటా అంటోంది. ఓట్ల కౌంటింగ్‌ పూర్తయిన తరవాత పార్టీలకు పడిన ఓట్లను లెక్కలోకి తీసుకుంటే.. కాంగ్రెస్‌-జేడీఎస్‌ కాంబినేషన్‌ మోడీకి డేంజర్‌ అని తేలుతోంది. 
కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఓట్లను కలిసితే నిన్నటి  కౌంటింగ్‌లో.. బీజేపీ  కేవలం 68 సీట్లకు పరిమితమయ్యేది. కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమికి 156 ఎమ్మెల్యే సీట్లు వచ్చేవని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ లెక్క తేల్చింది. ఇదే కాంబినేషన్‌లో 2019 ఎన్నికల్లో తలపడితే బీజేపీకి వచ్చే ఎంపీలు సీట్లు కేవలం ఆరు మాత్రమేనని లెక్కతేలింది. ప్రస్తుతం కర్ణాటక నుంచి బీజేపీకి 17 మంది ఎంపీలు ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం ఎంపీల సంఖ్య 28.
నిన్నటి ఓట్ల ప్రకారం లెక్కవేస్తే భాగల్‌ కోట్‌, హవేరి, ధర్వాడ్‌, ఉడిపి-చిక్‌ మంగళూర్‌, దక్షిణ కన్నడ, బెంగళూర్‌ సౌత్‌ ఎంపీ సీట్లు మాత్రమే బీజేపీకి దక్కే అవకాశాలు ఉన్నాయి. అంటే కోస్టల్‌ కర్ణాటకలో బీజేపీకి రెండు, బెంగళూరులో ఒకటి, ముంబై కర్ణాటకలో మూడు సీట్లు దక్కుతాయన్నమాట.   హైదరాబాద్‌-కర్ణాటక, దక్షిణ కర్ణాటక నుంచి బీజేపీకి ఒక్క ఎంపీ సీటు కూడా రాదని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ తేల్చింది. ఈ లెక్కన మిగిలిన 22 సీట్లు బీజేపీ, జేడీఎస్‌ కూటమికి దక్కుతాయన్నమాట.