నిమిషంలో వేడి బీర్ ని చిల్ చేస్తుంది!!

నిమిషంలో వేడి బీర్ ని చిల్ చేస్తుంది!!

స్నేహితులతో సరదాగా విహారయాత్రకు బయల్దేరినపుడు థర్మోసెస్ లో పెట్టుకున్న చిల్డ్ బీర్లు కాస్తా వేడెక్కితే వచ్చే కోపం, చిరాకు అంతా ఇంతా కాదు. ఈ సమస్యకు పరిష్కారం కనిపెట్టింది బ్లూక్వెంచ్ అనే కంపెనీ. కొత్త తరహా ఉత్పత్తుల ఆవిష్కరణ, నూతన పారిశ్రామికవేత్తల కోసం ఏర్పాటైన Indiegogoలో బ్లూక్వెంచ్ తమ Qoolerని ప్రవేశపెట్టింది. వీలైనంత త్వరగా చల్లని మంచుగడ్డలా ఉండే బీర్లు కావాలనుకొనే వారి కోసమే వచ్చేసింది ఈ Qooler. ఇదెంత త్వరగా బీర్లను చల్లబరుస్తుందంటే ఒక్క నిమిషం..60 సెకన్లలో చిల్డ్ బీర్ చేతుల్లో పెడుతుంది.

బ్లూక్వెంచ్ Qooler అలా ఎలా కేవలం 60 సెకన్లలో బీర్ క్యాన్ ను ఐస్ గడ్డంత చల్లగా చేయగలుగుతుంది? ఇదేం మాయ మంత్రం కాదు. ఈ మేజిక్ అంతా అది తిరిగే రొటేషన్లలో ఉంది. Qooler బాటిల్స్, క్యాన్లను నిమిషానికి 500 సార్లు(500 rpm) గిర్రున తిప్పేస్తుంది. ఆ సమయంలోనే చల్లని నీరుని క్యాన్లు/బాటిళ్లపై విపరీతమైన వేగంతో చిలుకుతుంది. దీంతో వాటిలోని వేడి వేగంగా బయటికి వెళ్లిపోతుంది. పానీయాలు తాగేటపుడు తెరిస్తే ఆ తిరిగిన ప్రభావం ఉంటుందేమోనని భయపడనక్కర్లేదు. Qooler నుంచి బయటకు తీయగానే ఆ ప్రభావం ఉండబోదని బ్లూక్వెంచ్ నమ్మకంగా చెబుతోంది.

ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ ఇందులో ఒక చిన్న తిరకాసు ఉంది. ఇది బాగా పనిచేయాలంటే మీరు కొంచెం ఐస్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. కొంచెం అంటే కొంచెమే కాదు కాస్త ఎక్కువగా. ఐస్ నిల్వచేసిన కంటెయినర్, సింక్, టబ్ లలో Qoolerని పెడితే అది తడాఖా చూపిస్తుంది. చిన్నగా ఉండి, కాలు ఎత్తు వరకు మార్చుకోగల వీలున్న Qooler కనీసం 19X10 అంగుళాల స్థలం ఉండే ఐస్ చెస్ట్ లలో అమరిపోతుంది. ఐస్ చెస్ట్ కాకపోతే ఏదైనా ప్లాస్టిక్ టబ్ తో, కిచెన్ సింక్ తోనైనా పని గడుస్తుంది. Qooler 20V రీఛార్జబుల్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 5-10 కేసుల బీర్ క్యాన్లను చల్లబరుస్తుంది. ఛార్జింగ్ కాకపోతే నేరుగా ప్లగ్ కి కూడా అమర్చుకొని నిరంతరాయంగా చిల్ చేసుకోవచ్చు.

మీరు కోరుకున్నంత చల్లదనం వచ్చేందుకు మీరు వేర్వేరు సైకిల్ సమయాలను ఎంచుకోవచ్చు. ఈ విషయం తెలిసినవాళ్లంతా ఈ Qooler ఎప్పుడు మార్కెట్లోకి వస్తుందా అని అంతే ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. మే 1 నుంచి Indigogoలో ఈ Qoolerని అమ్మకానికి పెడుతోంది బ్లూక్వెంచ్. కానీ దీని ధర కాస్త ఎక్కువేనని చెప్పాలి. ఆరంభ ధరగా 349 అమెరికన్ డాలర్లు(రూ.24,200)గా నిర్ణయించారు. భారీ స్థాయిలో ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత దీని వెలను 479 అమెరికన్ డాలర్లు (రూ.33,200) చేయనుంది కంపెనీ.