25వేల ఫీట్‌.. హీరో షాకింగ్‌ జంప్

25వేల ఫీట్‌.. హీరో షాకింగ్‌ జంప్

25వేల అడుగుల ఎత్తు.. ఊపిరి అంద‌నంత ప్ర‌మాద‌క‌ర శూన్య‌ప్ర‌దేశం... విమానంలో అంతెత్తుకు వెళ్లాడు... అక్క‌డి నుంచి ఎలాంటి భ‌యం-భీతి లేకుండా గాల్లోకి దూకేశాడు. అస‌లింత‌కీ ఈ ఫీట్ వేసిన వీరాధివీరుడి వ‌య‌సు ఎంతో తెలుసా?  తెలిస్తే షాక్ తింటారు. అత‌డి వ‌య‌సు 55. అస‌లింత‌కీ ఎవ‌రాయ‌న‌? అంటారా... ఆయ‌నే ది గ్రేట్ యాక్ష‌న్ హీరో టామ్ క్రూజ్‌. మ‌హేష్ ఫేవ‌రెట్ హీరో. టామ్ అస‌లింత‌కీ ఎందుకింత సాహ‌సం చేశాడు?

వివ‌రాల్లోకి వెళితే.. టామ్ క్రూజ్ ప్ర‌స్తుతం `మిష‌న్ ఇంపాజిబుల్` సిరీస్‌లో ఆరో సినిమా `ఫాల్ ఔట్‌`లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. జూన్ 27న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ చిత్రం రిలీజ‌వుతోంది. ఈ సినిమాలో ఓ స‌న్నివేశం చూస్తే ఒళ్లు గ‌గుర్పాటుకు గుర‌వ్వాల్సిందే. దాదాపు 25వేల అడుగుల ఎత్తులో ర‌న్నింగ్ విమానం లోంచి హీరో జంప్ చేసే స‌న్నివేశమ‌ది. దాదాపు 220 మైళ్ల వేగంతో.. 340 కి.మీల స్పీడ్‌తో గాల్లో దూకేసే సీన్ .. చూస్తే షాక్ తినాల్సిందే. ఈ జంప్‌ని హ్యాలో జంప్ అంటారు. అంత ఎత్తు నుంచి దూకేయ‌గానే వెంట‌నే పారాచూట్ తెరుచుకోదు.  కొంత స‌మ‌యం పాటు గాల్లోనే డైవ్ చేశాక‌.. పారాచూట్ తెరుచుకుంటుంది. అంత‌వ‌ర‌కూ అస‌లు ఊపిరాడ‌ని అనుభ‌వ‌మే. 55ఏళ్ల టామ్ క్రూజ్ అసాధార‌ణ‌మైన ఈ ఫీట్ వేసి చూపించాడు. ఒక మాస్క్ ధ‌రించి టామ్ ఈ ఫీట్ చేసి చూపించారు. క‌ళ్లు చెదిరే ఈ విన్యాసం న‌భూతోన‌భ‌విష్య‌తి. అయితే యుక్త‌వ‌య‌స్కుడిగా ఉన్న‌ప్ప‌టి నుంచి టామ్ క్రూజ్ ఇలాంటి ప్ర‌మాద‌క‌ర స‌న్నివేశాల్లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. మిష‌న్ ఇంపాజిబుల్ 5  కోసం విమానంలోంచి జంప్ చేసిన‌ప్పుడు తృటిలో పెనుప్ర‌మాద‌మే త‌ప్పిన సంగ‌తి తెలిసిందే. తాజాగా హ్యాలో జంప్ సీన్ 2నిమిషాల 37 సెక‌న్ల నిడివితో ఊపిరాడ‌నివ్వ‌లేదంటే న‌మ్మండి.