ప్రపంచంలోనే అతి సుందరమైన పుస్తకాల షాప్

ప్రపంచంలోనే అతి సుందరమైన పుస్తకాల షాప్

అర్జెంటినా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ లో రద్దీగా ఉండే వాణిజ్య కూడలి రెకొలెటా. ఇక్కడ మీరు నిర్మలమైన పుస్తకాల దేవాలయాన్ని చూడవచ్చు. ధారళంగా ప్రసరిస్తున్న చక్కటి వెలుతురులో మీరు అడుగడుగునా 20వ శతాబ్దపు ప్రారంభంలోని కళాకారుల నైపుణ్యానికి అద్దం పడుతూ ఉండే నిర్మాణాన్ని దర్శించవచ్చు. నిశ్శబ్దాన్ని చీలుస్తూ గుసగుసలు వినిపిస్తుంటాయి. ఆ వాతావరణం చదువరుల పఠనాసక్తిని పెంచుతుంది. కపూచినోలు, చాక్లెట్ సబ్మెరినోలు తాగుతూ పేజీలు తిప్పే పాఠకులు మనని ఆకట్టుకుంటారు.

ఇదే ప్రపంచంలోని అత్యంత సుందరమైన పుస్తకాల దుకాణం ఎల్ అటెనో. 1919లో ఈ భవనంలో ఓ థియేటర్ ప్రారంభించారు. ఇక్కడ ట్యాంగో డాన్సులు, సంగీత కచేరీలు, నాటకాల ప్రదర్శనలు చాలానే జరిగాయి. అలా ఒకనాడు వెలిగిపోయిన ఈ థియేటర్ ను ఇప్పుడు పుస్తకాల షాపుగా మార్చారు. ఇప్పుడు అక్కడ అచ్చయిన అక్షరాలే సూపర్ స్టార్స్. దుకాణంగా మార్చారే తప్ప ఆ రాజసం, దర్పం అణుమాత్రమైనా చెక్కు చెదరకుండా అలాగే ఉంచారు. ఎక్కడ చూసినా కళాఖండాలు, తలెత్తి చూస్తే అబ్బురపరిచే పెయింటెడ్ సీలింగ్, బాల్కనీలు, అందంగా అలంకరించిన శిల్పాలు చూపరులను అబ్బురపరుస్తాయి. 

అటెనో గ్రాండ్ స్ప్లెండిడ్ ను 2000లలో ప్రారంభించారు. ఇక్కడ మీకు వేలాదిగా పుస్తకాలు, సీడీలు, డీవీడీలు, ఇంకా ఎన్నో ఎన్నెన్నో లభిస్తాయి. ఏడాదికి 10 లక్షల మందికి పైగా ఈ దుకాణానికి వస్తుంటారంటే అర్థం చేసుకోవచ్చు దీని ఆకర్షణ శక్తి. పర్యాటకులు ఇక్కడ రంగురంగుల అల్మారాల్లో చక్కగా అమర్చిన వివిధ పుస్తకాలను చూసేందుకే వస్తుంటారంటే అతిశయోక్తి కాదు.