రాహుల్‌గాంధీ బయోపిక్‌లో హీరోయిన్‌ ఎవరు?

రాహుల్‌గాంధీ బయోపిక్‌లో హీరోయిన్‌ ఎవరు?

రాబోయే లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పూణెలో విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. ఎన్నికల సీజన్ లో రాజకీయ నేతల బయోపిక్ లు నిర్మాణమవుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బయోపిక్ రిలీజ్ పై చర్చ సాగుతోంది. మహారాష్ట్రలోని పూణెలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన రాహుల్ అక్కడి విద్యార్థులతో ముచ్చటించారు. లోకమాన్య తిలక్, బాల గంధర్వ్ బయోపిక్ లకు పనిచేసిన నటుడు సుబోధ్ భావే, రాహుల్ గాంధీ బయోపిక్ కి పని చేయాలని ఉందని చెప్పారు. అందులో హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలని రాహుల్ ని ప్రశ్నించారు. దీనికి రాహుల్ గాంధీ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. 'దురదృష్టవశాత్తూ తను తన పనిని పెళ్లాడానని' చెప్పారు. ఎప్పుడు పెళ్లాడతారనే ప్రశ్నను రాహుల్ తరచుగా ఎదుర్కొంటూనే ఉన్నారు. గత ఏడాది హైదరాబాద్ లో జర్నలిస్టులు ఈ ప్రశ్న అడినపుడు తనకు కాంగ్రెస్ పార్టీతో పెళ్లయిందని చెప్పారు. 

సోదరి ప్రియాంక గాంధీ వాద్రాపై వేసిన ప్రశ్నకు రాహుల్ గాంధీ చెప్పిన సమాధానం అందరినీ నవ్వుల్లో ముంచెత్తింది. ప్రియాంక, రక్షాబంధన్ గురించి అడిగినపుడు 'నాకో నియమం ఉంది. నేను ప్రియాంక కట్టిన రాఖీని అది తెగే వరకు అలాగే ఉంచుకుంటాను. అది తర్వాత రక్షాబంధన్ వరకు అలాగే ఉంటుందని' చెప్పారు. తన రాఖీని చూపేందుకు కుడిచేతిని పైకెత్తినపుడు ఆ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రేడియో జాకీ మలిష్కా కూడా తన చేతిని పైకి లేపబోయింది. ఆమెను అడ్డుకొని తను రాఖీని చూపించడానికి చెయ్యెత్తినట్టు రాహుల్ చెప్పారు.

గురువారం కేరళలోని వాయనాడ్ లో నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన తర్వాత ప్రియాంక వాద్రా ట్వీట్ గురించి ప్రశ్నించనపుడు 'ప్రియాంక నా బెస్ట్ ఫ్రెండ్. జీవితంలో ఇద్దరం కలిసి సాగుతున్నాం. మా ఇద్దరికి చాలా దగ్గరి అనుబంధం ఉందని' చెప్పారు. 'మేమెప్పుడూ గొడవ పడలేదు. కానీ ఆమె చాలా అల్లరి పనులు చేస్తుంది. నన్ను లావుగా చేసేందుకు మిఠాయిలు ఎక్కువ తినిపిస్తుందని' అన్నారు.