పాకిస్థానీకి టికెట్లు ఇప్పిస్తున్న ధోనీ

పాకిస్థానీకి టికెట్లు ఇప్పిస్తున్న ధోనీ

మహేంద్ర సింగ్ ధోనీ, కరాచీలో పుట్టిన మొహమ్మద్ బషీర్ ల బంధం భారత్-పాకిస్థాన్ 2011 ప్రపంచ కప్ సెమీఫైనల్ లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇది మరింత బలపడుతూ వచ్చింది. ఈ బంధం ఎలాంటిదంటే బషీర్ మ్యాచ్ టికెట్ లేకపోయినా ఆదివారం జరిగే భారత్-పాక్ మ్యాచ్ కోసం చికాగో నుంచి మాంచెస్టర్ (దాదాపు 6000 కి.మీల దూరం) వచ్చేశాడు. ఓల్డ్ ట్రాఫోర్డ్ లో జరగబోయే మ్యాచ్ చూసేందుకు ధోనీ తన కోసం తప్పకుండా ఏదో ఒకటి చేస్తాడనే నమ్మకం అతనిది. అమెరికా పాస్ పోర్ట్ ఉన్న ఈ 63 ఏళ్ల క్రికెట్ ఫ్యాన్ కి చికాగోలో ఒక రెస్టారెంట్ ఉంది. 

'నేను ఇక్కడికి నిన్ననే వచ్చాను. ఇక్కడ అంతా ఒక్కో టికెట్ కి 800-900 పౌండ్లు ఖర్చు చేస్తున్నారు. చికాగో తిరిగి వెళ్లేందుకు టికెట్ కూడా ఇంతే ఖరీదు. మ్యాచ్ చూసేందుకు నేను ఇంత కష్టపడకుండా చేస్తున్నందుకు ధోనీకి నా కృతజ్ఞతలు' అని బషీర్ చెప్పాడు. అప్పుడప్పుడు ధోనీని కలవడం ఇతర ఆటగాళ్లకు కూడా కష్టమవుతుంది. కానీ ఎంఎస్ మాత్రం ఈ చికాగో చాచాని ఎప్పుడూ నిరాశ పరచలేదు.

'నేను అతనికి ఎప్పుడూ ఫోన్ చేయను. ఎందుకంటే అతను బాగా బిజీగా ఉంటాడు. మెసేజ్ లు పెడుతూ అతనితో టచ్ లో ఉంటాను. నేనిక్కడికి రాకముందే ధోనీ నాకు టికెట్ గురించి హామీ ఇచ్చాడు. అతను ఎంతో మంచి వ్యక్తి. 2011లో మొహాలీ మ్యాచ్ తర్వాత అతను నా కోసం ఏం చేశాడో ఎవరూ ఊహించలేరని నాకనిపిస్తుందని' మొహమ్మద్ బషీర్ చెప్పాడు.