కార్గిల్ అమరవీరులకు లేఖల శ్రద్ధాంజలి

కార్గిల్ అమరవీరులకు లేఖల శ్రద్ధాంజలి

కార్గిల్ యుద్ధంలో దేశం కోసం అమరులైన సైనికుల వీరత్వాన్ని దేశం సదా స్మరించుకుంటుంది. మాతృభూమి కోసం తమ ప్రాణాలను బలిపెట్టిన జవాన్ల వీరగాథలు ఒక వ్యక్తిని ఎంతో ప్రభావితం చేశాయి. దీంతో అతను ఆ వీరుల ఇళ్ల నుంచి మట్టిని సేకరిస్తున్నాడు. రాజస్థాన్ కి చెందిన 37 ఏళ్ల జితేంద్ర సింగ్ గుర్జర్ ను కార్గిల్ అమర వీరుల బలిదానం ఎంతగా ప్రభావితం చేసిందంటే 20 ఏళ్లుగా అతను వారి కుటుంబాలకు క్రమం తప్పకుండా లేఖలు రాస్తున్నాడు. జితేంద్ర సింగ్ అమరుల ఇళ్ల నుంచి సేకరించిన మట్టితో భవిష్యత్తులో ఒక స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలనుకుంటున్నాడు.

జితేంద్ర గుజరాత్ లోని సూరత్ లో ఒక ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. జితేంద్ర సింగ్ గుర్జర్ గత రెండు దశాబ్దాలు అంటే 20 ఏళ్లుగా కార్గిల్ లో అమరులైన యుద్ధవీరుల కుటుంబాలకు ఉత్తరాలు రాస్తున్నాడు. తను లేఖ రాసే పోస్ట్ కార్డుపై జితేంద్ర భారత త్రివర్ణ పతాకం స్కెచ్ గీస్తాడు. దాని పక్కన సత్యమేవ జయతే అని రాస్తాడు. ‘1999 కార్గిల్ యుద్ధంలో మరణించిన అమర వీరుల వీరగాథలే తను లేఖలు రాసేందుకు ప్రేరేపించాయని‘ చెప్పాడు.

‘కార్గిల్ యుద్ధం జరిగి 20 ఏళ్లవుతోంది. ఈ యుద్ధంలో నా గ్రామానికి చెందిన ఎందరో సైనికులు, సైనికాధికారులు అమరులయ్యారు. వారి ధైర్యసాహసాల గురించి కథలు విని ఎంతో ప్రభావితం అయ్యాను. దాంతో వాళ్ల కుటుంబాలకు ఉత్తరాలు రాయాలని భావించాన‘ని జితేంద్ర సింగ్ తెలిపాడు. కొన్ని కుటుంబాలు జితేంద్ర సింగ్ లేఖలు చదివి ఆనందిస్తాయి. కొందరు తమవారిని గుర్తు చేసుకొని దు:ఖిస్తారు. మరికొందరు తమవారి జ్ఞాపకాలలో మునిగిపోతారని చెప్పుకొచ్చాడు.

రాజస్థాన్ భరత్ పూర్ జిల్లాకి చెందిన గుర్జర్ కి అప్పుడప్పుడు అమరవీరుల కుటుంబాల నుంచి జవాబు లేఖలు వస్తుంటాయి. అవి చదివినపుడు ఎంతో భావోద్వేగాలకు గురవుతానని చెప్పాడు. ఉత్తరాలు రాయడం సరిపెట్టకుండా జితేంద్ర 40-50 మంది సైనికుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పరామర్శించాడు. వారు అతనిని తమ సొంత బిడ్డలాగా భావించి ఆదరించారని చెబుతాడు. అలా వెళ్లినపుడు వారి ఇంటి నుంచి కొంత మట్టిని సేకరించి తెస్తాడు. ఆ మట్టితో భవిష్యత్తులో అమర జవాన్ల స్మారక చిహ్నం ఏర్పాటు చేస్తానని గుర్జర్ చెబుతున్నాడు.

వార్తాపత్రికలు, ఛానెళ్లలో వచ్చే సైనికుల వీరగాథలు తన హృదయాన్ని తాకుతాయని తెలిపాడు. ముఖ్యంగా 95 ఏళ్ల చున్నీ సింగ్ కు 65 ఏళ్ల తర్వాత పెన్షన్ వచ్చిందని.. లక్ష్మణ్ సింగ్ అనే వ్యక్తి ముగ్గురు కుమారులు యుద్ధంలో ప్రాణాలు కోల్పోవడాన్ని తాను మరచిపోలేనని చెప్పాడు. దేశం కోసం ప్రాణాలర్పించిన ప్రతి సైనికుడి గురించి గుర్జర్ సమాచారం సేకరించి పెట్టాడు. 2004లో పోస్ట్ కార్డ్ ధర చౌకగా ఉండేదని ఇప్పుడు 66%ఎక్కువ ఖరీదైందని వాపోతున్నాడు. దీని గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖలు రాస్తూనే ఉన్నానని.. కానీ దీనిపై చర్యలు మాత్రం తీసుకోలేదన్నాడు.