ఈ సారీ జాతిపితపై సంచలన వ్యాఖ్యలు చేసిన కంగన

ఈ సారీ జాతిపితపై సంచలన వ్యాఖ్యలు చేసిన కంగన

ముంబై: భారత ఉక్కు మనిషి బిరుదును పొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టిన రోజు సందర్భంగా ఎందరో ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. అయితే వారిలో బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ కూడా ఉంది. ఒకవైపు వల్లభాయ్ పటేల్‌ను పోగుడుతూనే మరోవైపు గాంధీ, నెహ్రూలపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈమేరకు తన ట్విటర్ ఖాతా ద్వారా కొన్ని ట్వీట్‌లు చేసింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ అసలైన ఉక్కు మనిషని, ఆయన కావాలనే తన పదవిని త్యాగం చేశారని పేర్కొంది. అంతేకాకుండా భారతదేశానికి మొట్టమొదటి ప్రధాన మంత్రి అయ్యే అవకాశాన్ని మానసికంగా బలహీనుడైన నెహ్రూ కోసం త్యాగం చేశారని తన ట్వీట్‌లలో రాసుకొచ్చింది. ‘భారత ఉక్కు మనిషి వల్లభాయ్ పటేల్‌కు జన్మదిన సుభాకాంక్షలు. మాకు ఈ అఖండ భారత దేశాన్ని అందించిన మాహాను భావులు మీరు. మీ గొప్ప నాయకత్వంతో ఇంతటి ఘనత సాధించారు. మీరు దూరమవ్వడం దేశానికి తీర్చలేని లోట’ని కంగనా తన ట్వీట్‌లలో పేర్కొంది.

 ‘పటేల్ నిజమైన ఉక్కు మనిషి. గాంధీ నెహ్రూ వంటి మానసికంగా బలహీనులను కావాలనే ఎంచుకున్నాడు. ఎందుకంటే నెహ్రూను ముందుంచి గాంధీ తనకు నచ్చినట్టు కథను నడింపించేందుకు ఇలా చేసుండొచ్చని నేను నమ్ముతున్నాను. అయితే గాంధీ మరణించిన తరువాత దేశ పరిస్థితి ఘోరంగా తయారయింద’ని కంగనా చేసిన మరి కొన్ని ట్వీట్‌లలో పేర్కొంది. అంతేకాకుండా పటేల్ గారు కేవలం గాంధీ నెహ్రూపై మొగ్గు చూపుతున్నాడని, గాంధీను ఆనందపెట్టేందుకు తన పదవిని త్యాగం చేశారని, వల్లభాయ్ పటేల్ ఎటువంటి బాధ పడకపోయినా దేశం మాత్రం కొన్ని దశాబ్దాలుగా బాధపడుతుందని చెప్పింది. కేవలం పటేల్ గారి కన్నా నెహ్రూ ఇంగ్లీష్ బాగా మాట్లాడగలరన్న ఒక్క కారణంతో నెహ్రూను ప్రధాన మంత్రిని చేయడానికి గాంధీ ప్రయత్నించాడని కంగన అంది. సర్దార్ వల్ల భాయ్ పటేల్ విడిపోయి ఉన్న 562 రాజసంపద ప్రాంతాలను ఏకం చేసి, అఖండ భారత దేశాన్ని నిర్మించడంతోపాటు దేశ ప్రజలకు స్వతంత్ర భారత దేశాన్ని అందించి ఎందరికో ఆదర్శంగా నిలిచారు.