మెరుపు వేగంతో దూసుకెళ్లే వందే భారత్ ఎక్స్ ప్రెస్

మెరుపు వేగంతో దూసుకెళ్లే వందే భారత్ ఎక్స్ ప్రెస్

వందే భారత్ ఎక్స్ ప్రెస్ గా నామకరణం జరుపుకున్న ట్రెయిన్ 18కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫిబ్రవరి 15న న్యూఢిల్లీలో జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ సెమీ-హైస్పీడ్ ఇంజన్ రహిత ట్రెయిన్ 18 ఢిల్లీ-వారణాసిల మధ్య పరుగులు పెట్టనుంది. ఈ రైలు 750కి.మీల దూరాన్ని 8 గంటల్లో పూర్తి చేయనుంది. వందే భారత్ ఎక్స్ ప్రెస్ లేదా ట్రెయిన్ 18 భారత్ లోనే అత్యంత వేగంగా ప్రయాణించే రైలు. ఆర్డీఎస్వో పలుమార్లు నిర్వహించిన ట్రయల్స్ లో ఈ స్వీయ చోదకశక్తి గల రైలుబండి గంటకు 180కి.మీల వేగాన్ని కూడా దాటేసింది. భారతీయ రైల్వే ట్రాకులపై ఇప్పటివరకు ఇంత వేగంగా ప్రయాణించిన ఒకేఒక్క ట్రెయిన్ స్పానిష్ టాల్గో మాత్రమే.

భారతీయ రైల్వే పట్టాలపై వందే భారత్ ఎక్స్ ప్రెస్ పరుగులు పెడుతున్న అనేక వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీటిలో కొన్నిటిలో అయితే ఎంత హైస్పీడ్ లో ప్రయాణిస్తున్నా ట్రెయిన్ 18లో నీళ్ల సీసాల్లో నీరు నిశ్చలంగా ఉండటాన్ని చూపిస్తున్నాయి. తాజాగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ కి సంబంధించిన ఓ వీడియోని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో చూస్తే రైలు ప్రయాణం అంటే ఇష్టపడేవారికి కచ్చితంగా నచ్చేయడం ఖాయం. ‘ఇదో పక్షి.. ఇదో ప్లేన్. మేకిన్ ఇండియాలో భాగంగా తయారైన భారత్ మొట్టమొదటి సెమీ-హైస్పీడ్ ట్రెయిన్, వందే భారత్ ఎక్స్ ప్రెస్ మెరుపు వేగంతో దూసుకెళ్లడాన్ని చూడండి.’ అని పీయూష్ గోయల్ వీడియోతో పాటు ట్వీట్ చేశారు. వీడియో చూస్తే ఆ సమయంలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఎంత వేగంతో ప్రయాణిస్తోందో కచ్చితంగా చెప్పడం కష్టమే అయినా కచ్చితంగా అత్యధిక వేగాల్లో ఉండొచ్చనిపించేలా ఉంది.


విలాసవంతమైన వందే భారత్ ఎక్స్ ప్రెస్ ని చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారుచేశారు. మేకిన్ ఇండియాలో భాగంగా పూర్తి దేశీయంగా రూపొందిన ఈ రైలు రూపకల్పన, ఉత్పత్తికి దాదాపుగా రూ. 97 కోట్లు ఖర్చయ్యాయి. ట్రెయిన్ 18గా కోడ్ నేమ్ పెట్టిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ ని గరిష్టంగా గంటకు 160కి.మీల వేగంతో ప్రయాణించేందుకు తయారుచేశారు. ట్రయల్స్ మాత్రం గంటకు 180కి.మీల వేగంలో పరీక్షించినట్టు సమాచారం. ఇంజన్ లేని ఈ రైల్లో అన్నీ ఏసీ ఛెయిర్ కార్ కోచ్ లు ఉంటాయి. ప్రపంచస్థాయి సౌకర్యాలుండే ఈ రైలుని కీలకమైన రూట్లలో శతాబ్ది ఎక్స్ ప్రెస్ స్థానంలో ప్రవేశపెట్టనున్నారు.