రథయాత్రకు అడ్డుకుంటే చక్రాల కింద నలిగిపోతారు..

రథయాత్రకు అడ్డుకుంటే చక్రాల కింద నలిగిపోతారు..

పశ్చిమ బెంగాల్‌ బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు లాకెట్‌ ఛటర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్‌లో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటూ బీజేపీ చేపట్టే రథయాత్రను అడ్డుకుంటే రథ చక్రాల కింద నలిగిపోతారని హెచ్చరించారు. కోల్ కత్తాలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకే రథయాత్రలు నిర్వహిస్తున్నామన్నారు. బీజేపీ చేపట్టనున్న రథయాత్రలను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. డిసెంబర్‌ 5,6,7 తేదీల్లో రాష్ట్రంలో రథయాత్ర చేపట్టాలని బీజేపీ యోచిస్తుంది. ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా ఈ యాత్రను ప్రారంభించనున్నారు. చివరిరోజున కోల్‌కతాలో జరిగే భారీ ర్యాలీకి ప్రధాని నరేంద్రమోడీ హాజరవుతున్నట్లు సమాచారం. లాకెట్ ఛటర్జీ వ్యాఖ్యలపై తృణమూల్‌ కాంగ్రెస్‌ మండిపడింది. రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలిగించేందుకే బీజేపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించింది. బెంగాల్‌ ప్రజలపై మతతత్వ ఎజెండా రుద్దడమే బీజేపీ ప్రధాన లక్ష్యమని టీఎంపీ సెక్రటరీ జనరల్‌ పార్థ ఛటర్జీ విమర్శించారు.