బీఎస్ఎఫ్ జవాన్లపై బంగ్లా స్మగ్లర్ల దాడి..!

 బీఎస్ఎఫ్ జవాన్లపై బంగ్లా స్మగ్లర్ల దాడి..!

భారత్-బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దుల వద్ద కొందరు స్మగ్లర్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్లపై దాడికి దిగారు. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం... ఈ ఘటన నార్త్ 24 పరగణాస్ జిల్లాలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. బాన్స్ ఘాటా పోస్ట్ దగ్గర కాపలా ఉన్న జవాన్లపై స్మగ్లర్లు దాడి చేసారు. ఈ దాడిలో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. జవాన్లు 107 బెటాలియన్ కు చెందినవారని..వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించామని బీఎస్ఎఫ్ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. దాదాపు 10 నుండి 12మంది స్మగ్లర్లు దాడి చేసినట్టుగా గుర్తించారు. స్మగ్లర్లు సరిహద్దులు దాటే క్రమంలో జవాన్లు హెచ్చరించగా వారు కర్రలు, ఆయుధాలతో దాడి చేసారు. జవాన్లు తిరిగి కాల్పులు జరిపేసరికి స్మగ్లర్లు బంగ్లాదేశ్ వైపు పరుగులు తీశారు. ఘటనాస్థలంలో ఎనిమిది కిలోల మరిజువానా డ్రగ్ ను అధికారులు గుర్తించారు. దేశంలోకి మాదక ద్రవ్యాలను తీసుకు వచ్చేందుకు స్మగ్లర్లు ప్రయత్నించి విఫలం అయ్యారని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు స్మగ్లర్లకు కూడా గాయాలయ్యాయని అన్నారు.