ముగ్గురి ప్రాణాలు తీసిన బైక్ రేసింగ్‌

ముగ్గురి ప్రాణాలు తీసిన బైక్ రేసింగ్‌

శ్రీకాకుళం జిల్లాలో నిన్న జరిగిన ప్రమాదానికి బైక్‌ రేసింగే కారణమని తేల్చారు పోలీసులు. గార మండలం చల్లపేట వద్ద జరిగిన బైక్ యాక్సిడెంట్‌పై పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా ఊహించని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 

శ్రీకాకుళం పట్టణానికి చెందిన దువ్వు హిమశేఖర్‌ (18) అనే యువకుడు బుధవారం తన స్నేహితుడి ఇంట్లో పుట్టిన రోజు జరుపుకొన్నాడు. అనంతరం వేకువజామున కళింగపట్నం సముద్ర తీరానికి మూడు ద్విచక్ర వాహనాలపై ఆరుగురు స్నేహితులు కలిసి బయలుదేరి వెళ్తూ.. గార మండలంలోని చల్లపేట గ్రామం వద్ద మరో ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్నారు. ఈ ఘటనలో హిమశేఖర్‌, దామోదర శ్రీనివాసరావు (35), బెహర తేజ (15) మృతి చెందారు. 

ఈక్రమంలో పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు ప్రారంభించగా.. హిమశేఖర్‌ స్నేహితులు బైక్‌ రేసింగ్‌కు పాల్పడతున్నట్టు తేలింది. అర్ధరాత్రి పూట పెట్రోల్‌ చోరీ చేసి.. జల్సాలు చేయడం ఈ బైక్ రైడింగ్ బ్యాచ్ దినచర్య. ఈక్రమంలోనే బుధవారం హిమశేఖర్‌ పుట్టినరోజు సందర్భంగా బెట్టింగ్‌ వేసుకున్నారు. పట్టణం నుంచి కళింగపట్నానికి ఎవరు ముందుగా చేరుకుంటారో పందెం కాసి.. జెట్‌ వేగంతో మూడు బైక్స్‌పై దూసుకెళ్లారు. ఈక్రమంలో కూరగాయల వ్యాపారి దామోదర శ్రీనివాసరావు బైక్‌ను హిమశేఖర్‌ తన బైక్‌తో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో శ్రీనివాసరావు, హిమశేఖర్‌తోపాటు తేజ మృతిచెందాడు.