వరంగల్‌లో కారు ప్రమాదం.. మూడు కుటుంబాల్లో విషాదం

వరంగల్‌లో కారు ప్రమాదం.. మూడు కుటుంబాల్లో విషాదం

వరంగల్‌ జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం తీగ రాజుపల్లి లో ఎస్ఆర్ఎస్ పి కెనాల్ లో కారు పడి ఇద్దరి మృతి చెందగా, ఒకరి గల్లంతు అయ్యారు. ఈ ఘటనలో అదృష్టవశాత్తు విజయభాస్కర్ అనే వ్యక్తి బయటపపడ్డాడు..  వరంగల్ నుండి పర్వతగిరి వైపు వెళుతున్న కారు అదుపు తప్పి ఎస్‌ఆర్‌ఎస్‌పీ కెనాల్‌లో పడిపోయింది.. ఈ ప్రమాదంలో స్కూల్‌కు లేట్ అవుతుంది.. త్వరగా వెళ్లాలని భావించి లిఫ్ట్ అడిగి కారు ఎక్కిన ప్రభుత్వ టీచర్‌తో పాటు మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ వినాయక ట్రేడర్స్ కు చెందిన వీర్ల శ్రీధర్ అనే వ్యక్తి తన బ్రిజా కారులో డ్రైవర్ బైకానీ రాజేష్, మరో ప్రైవేట్‌ ఉద్యోగి హంస విజయ భాస్కర్‌ కలిసి వరంగల్ నుండి పర్వతగిరి వైపు వెళుతున్నారు. వీరి కారు తీగరాజుపల్లికి చేరుకునే సరికి గుంటూరు పల్లి జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా పని చేస్తున్న పసుల సరస్వతి.. లిఫ్ట్ అడిగి ఆ కారు ఎక్కారు. అక్కడి నుండి కొద్దిదూరం ప్రయాణం చేసిన తర్వాత  ఆ కారు అదుపు తప్పి ఎస్ఆర్ఎస్పి కాలువలో పడిపోయింది.. దీంతో అందరూ చూస్తుండగానే పసుల సరస్వతి, వీర్ల శ్రీధర్ ఈత రాకపోవడంతో నీటిలో మునిగి చనిపోయారు. ఈత వచ్చిన విజయభాస్కర్ కారు డోరు తీసుకుని బయటకు వచ్చి ప్రాణాలు దక్కించుకున్నారు. అతడికి, తాడు అందించి అందుబాటులో ఉన్న కొందరు రక్షించారు. అయితే, కారు డ్రైవర్ రాజేష్ మాత్రం కార్ లోనే ఉన్నట్లుగా భావిస్తున్నారు. కారు డ్రైవ్ చేస్తున్న సమయంలో సీట్ బెల్ట్ పెట్టుకున్న రాజేష్ బయటికి రాలేక పోయి అందులోనే చిక్కుకుని మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు. ఈ ఘటనతో అక్కడ విషాదం అలుముకుంది.