గ్యాస్‌ సిలిండర్‌ పేలి ముగ్గురు సజీవదహనం

గ్యాస్‌ సిలిండర్‌ పేలి ముగ్గురు సజీవదహనం
గ్యాస్‌ సిలిండర్‌ పేలి ముగ్గురు అక్కాచెల్లెళ్లు బుధవారం సజీవదహనమయ్యారు. ఈ సంఘటన ఓడిశాలోని మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలోని జగన్నాథ మందిరం వీధిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం... వైశ్య సామాజిక వర్గానికి చెందిన గణపతి రావు, లక్ష్మి దంపతులకు మొత్తం ఆరుగురు సంతానం. ఇందులో ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు. అమ్మాయిల్లో మంగ(40), మేనక(36), రేణుక(25)లు ఇంట్లోనే ఉంటూ చేగోడీలు, చుప్పులు వంటి తిను బండారాలు తయారు చేస్తే.. వాటిని తండ్రి, సోదరులు మార్కెట్‌లో విక్రయిస్తూ జీవనం సాగించేవారు. అయితే తాజాగా తండ్రి గణపతిరావు ఈ నెల 7వ తేదీన మృతిచెందాడు. తండ్రి దశదిన కర్మలు పూర్తి చేసిన అనంతరం అస్థికలు కలిపేందుకు అన్నదమ్ములు ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రికి వెళ్లారు. ఆ సమయంలో అక్కాచెల్లెళ్లు ఇంట్లో ఉన్నారు. ఈ క్రమంలో అకస్మాత్తుగా గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. ఇది గమనించిన పొరుగువారు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే అక్కాచెల్లెళ్లు ముగ్గురూ కాలి బూడిద అయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి కేసు నమోదు చేసి మృతదేహాలను మల్కన్‌గిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే ఈ సంఘటన ప్రమాదం కాదని.. వారివి ఆత్మహత్యలని సమాచారం. కుటుంబంకు భారం కాకూడదనే వారు ఆత్మహత్యలకు పాల్పడరని సమాచారం.