టిఫిన్‌ బాక్స్ కలకలం...

టిఫిన్‌ బాక్స్ కలకలం...

హైదరాబాద్‌ నగరంలోని ఖైరతాబాద్‌ సర్కిల్‌లో ఈరోజు టిఫిన్‌ బాక్స్‌ కలకలం సృష్టించింది. వివరాల ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం ఖైరతాబాద్‌ సర్కిల్‌లో ఆనందనగర్‌ కాలనీలోకి వెళ్లే మార్గంలో బీఎండబ్ల్యూ కారు, పక్కనే టిఫిన్‌ బాక్స్‌ ఉండటాన్ని గుర్తించారు స్థానికులు. చాలాసమయం తర్వాత కూడా టిఫిన్‌ బాక్స్‌ అలాగే ఉండటంతో.. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. డాగ్‌స్క్వాడ్‌, బాంబుస్క్వాడ్‌ బృందాలతో టిఫిక్‌బాక్స్‌ను తనిఖీ చేసి అందులో పేలుడు పదార్థాలు ఏమీ లేవని తేల్చారు. ఇక టిఫిన్ బాక్స్‌ను తెరచి చూడగా.. అన్నం ఉంది. కారు యజమానిని విచారించగా.. గ్యాస్‌ కట్టర్‌ కోసం వెళ్లినట్లు తెలిపాడు. అతడిని అదుపులోకి తీసుకుని పంజాగుట్ట పోలీసు స్టేషన్‌కు తరలించారు. కారు, ల్యాప్‌ట్యాప్‌ ను పరిశీలించి.. అనుమానించదగ్గ ఆధారాలు ఏమీ లేకపోవడంతో అతనిని వదిలిపెట్టినట్లు పంజాగుట్ట సీఐ తెలిపారు. టిఫిన్‌ బాక్స్‌లో ఏమీ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.