టిక్‌టాక్ వీడియో వైరల్.. యువకుడి ఆత్మహత్య..
సోషల్ మీడియా ప్రాణాలు తీస్తోంది.. ఫేస్బుక్, వాట్సాప్ ఇలా ఇప్పుడు టిక్‌టాక్ వంతు వచ్చింది.. టిక్‌టాక్ వీడియో మరో యువకుడి ప్రాణం తీసింది. మనస్థాపానికి గురైన యువకుడు కువైట్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మోహన కుమార్ పరారీలో ఉన్నాడనీ... రెండు వేల దీనార్లు ఎగ్గొట్టాడనీ కువైట్‌లోనే ఉంటున్న అతడి స్నేహితులు టిక్ టాక్ వీడియో చేశారు. దాన్ని సోషల్ మీడియాలో బాగా ప్రచారం చేశారు. దీంతో మనస్తాపానికి గురైన మోహన కుమార్ ఈనెల 3న కువైట్‌లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు కువైట్ ఎంబసీతో సంప్రదింపులు జరిపారు. మోహన కుమార్ మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. మోహన కుమార్ ఆత్మహత్యకు కారణమైన ఆరుగురు స్నేహితులపై కువైట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వివరాల్లోకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం శివకోడు పోస్టాఫీసు వీధికి చెందిన పుచ్చకాయల మోహన కుమార్ ఉపాధి కోసం కువైట్ వెళ్లాడు. అక్కడ పని చేసుకుంటూ ఇంటి వద్ద ఉండే అమ్మకు డబ్బులు పంపిస్తుండే వాడు. మోహన కుమార్‌ను కువైట్‌లోనే అతడి స్నేహితులైన వడ్డి దుర్గారావు, మధు సహా మరికొందరు బెట్టింగులకు అలవాటు చేశారు. ఈ క్రమంలో మోహన కుమార్ తన స్నేహితులకు 300 ధరమ్స్ వరకూ బాకీ పడ్డాడు. వారి వేధింపులు భరించలేక మరో కంపెనీలోకి వెళ్లిపోయాడు మోహన కుమార్. అయితే తమకు డబ్బులు ఇవ్వాల్సిన మోహన కుమార్ పరువు తీసేందుకు స్నేహితులు టిక్ టాక్ని ఎంచుకున్నారు. అతడి ఫొటోలతో ఓ వీడియోను తయారు చేశారు. చిట్టీల పేరుతో రెండు వేల కువైట్ కరెన్సీ ధరమ్స్ కు టోకరా వేసి పరారీలో ఉన్నాడన్న వాయిస్ వీడియోని టిక్ టాక్‌లో వైరల్ చేశారు. దీంతో మనస్థాపం చెందిన మోహన కుమార్ ఈ నెల 3న కువైట్‌లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లిన మోహన కుమార్ చనిపోవటం స్థానికులను సైతం కలచివేసింది. మరోవైపు... మోహన కుమార్ ఆత్మహత్యకు కారణామైన ఆరుగురు స్నేహితులపై కువైట్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయం కోసం స్థానిక పోలీసులని ఆశ్రయిస్తామని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మొత్తానికి టాక్‌టాక్ వీడియో మరో నిండుప్రాణాన్ని బలితీసుకుంది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)