టిక్ టాక్ యాప్ పై నిషేధం ఎత్తేసిన మద్రాస్ హైకోర్ట్

టిక్ టాక్ యాప్ పై నిషేధం ఎత్తేసిన మద్రాస్ హైకోర్ట్

మద్రాస్ హైకోర్ట్ కి చెందిన మదురై బెంచ్ వీడియో మొబైల్ అప్లికేషన్ టిక్ టాక్ పై నిషేధాన్ని ఎత్తేసింది. చైనాకు చెందిన షార్ట్ వీడియో అప్లికేషన్ ని ఇకపై డౌన్ లోడ్ చేయకుండా నిషేధం విధించాలని ప్రభుత్వానికి సూచించిన మూడు వారాల్లోగానే కోర్టు తన నిర్ణయం మార్చుకొంది. ఏప్రిల్ 3న 'పిల్లలకు హానికరం'గా పేర్కొంటూ దేశంలో టిక్ టాక్ యాప్ డౌన్ లోడింగ్ నిషేధించాలని ప్రభుత్వానికి బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. గత వారం ప్రభుత్వ ఆదేశాల మేరకు గూగుల్, యాపిల్ తమ యాప్ స్టోర్ల నుంచి టిక్ టాక్ ను తొలగించాయి.

యాప్ ప్రభావాన్ని పరిశీలించేందుకు అమికస్ క్యూరీగా కోర్టు నియమించిన అరవింద్ దాతర్ బుధవారం వాదిస్తూ అప్లికేషన్ ను నిషేధించడం సమస్యకు పరిష్కారం కాదని, అర్హులైన యూజర్ల హక్కులు సంరక్షించాలని అన్నారు. టిక్ టాక్ వంటి సంస్థలకు యూజర్లు తయారుచేసిన కంటెంట్ పై బాధ్యత లేదని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలో ఉన్నట్టు దాతర్ తెలిపారు. సంస్థలు తమ ప్లాట్ ఫామ్ లో పెట్టిన సమాచారాన్నంతా తప్పనిసరిగా పరిశీలించాలని ఐటీ చట్టంలో లేదన్నారు. 

యాప్ ని నిషేధిస్తూ మద్రాస్ హైకోర్ట్ ఇచ్చిన తాత్కాలిక ఉత్తర్వులపై బైట్ డ్యాన్స్ వేసిన పిటిషన్ ను సోమవారం విచారించిన సుప్రీంకోర్ట్, బుధవారం విచారణలో తన నిర్ణయాన్ని ప్రకటించాలని మద్రాస్ హైకోర్ట్ కు సూచించింది.