తిరుమలలో కిడ్నాపైన బాలుడి ఆచూకి లభ్యం

తిరుమలలో కిడ్నాపైన బాలుడి ఆచూకి లభ్యం

తిరుమలలో కిడ్నాపైన బాలుడి ఆచూకి లభించింది. మహారాష్ట్రలో బాలుడు వీరేశ్ (16 నెలలు)ను పోలీసులు గుర్తించారు. దీంతో రెండు రోజుల ఉత్కంఠకు తెరపడింది. తిరుమలలో శుక్రవారం ఉదయం బాలుడు వీరేశ్ కిడ్నాప్ అయ్యాడు. కొండపై నుండి బాలుడిని తీసుకొని కిడ్నాపర్ రైలెక్కుతున్నట్టు సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డు అయింది. వీటి ఆధారంగా కిడ్నాపర్ బాలుడిని తీసుకొని మహారాష్ట్రకు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. 

పోలీసులు నాలుగు బృందాలుగా విడిపోయి నాందేడ్‌లో బాలుడి కోసం గాలించారు. బాలుడు కిడ్నాప్ అయినట్టు పత్రికలు, ఛానెల్స్, సోషల్ మీడియా వేదికగా ప్రచారం సాగింది. సోషల్ మీడియా ద్వారా బాలుడిని, నిందితుడిని ఆదివారం ఉదయం మహారాష్ట్ర పోలీసులు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ఇక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో వారు ఊపిరిపీల్చుకున్నారు. పోలీసులు బాలుడిని తిరుమలకు తీసుకురానున్నారు. మరోవైపు నాందేడ్ నుంచి నిందితుడిని తీసుకువచ్చేందుకు ఏపీ పోలీసులు బయలుదేరారు. అయితే బాలుడిని ఎందుకు కిడ్నాప్ చేసాడో ఇంతవరకు తెలియరాలేదు. కిడ్నాప్ కు గల కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.