తిరుపతి మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..

తిరుపతి మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..

సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నుంచి మరోసారి బరిలోకి దిగి ఓటమి పాలైన తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌లో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై కోర్టుకు వెళ్తామని.. రీ కౌంటింగ్ కోరనున్నట్టు ఆమె ప్రకటించారు. తిరుపతిలో గెలిచింది తెలుగుదేశం పార్టీయే అందులో సందేహమే లేదన్న ఆమె... ఎన్నికల కౌంటింగ్ సమయంలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. 12వ రౌండ్ వరకు 1500 ఓట్లు మెజార్టీలో ఉన్నాం.. కానీ, పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపులో అక్కడి ఆర్వో అవకతవకలు పాల్పడినట్టు ఆరోపించారామె. ఎంపీకి వచ్చిన 250 పోస్టల్ బ్యాలెట్ ఓట్లుకు తనకు ఎందుకు రావని ప్రశ్నించిన ఆమె... 350 ఓట్లు ఎందుకు పక్కన పెట్టారో తెలియదని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఇక 175 ఓట్లు చెల్లవని చెప్పారని.. ఇలా 750 ఓట్లతో గెలిచారని మండిపడ్డారు. రాష్ట్రంలో వైసీపీ ఆధికారంలోకి వచ్చిందని తెలిసే కౌంటింగ్ రోజున అధికారులు ఆ పార్టీ సహకరించారని సంచలన ఆరోపణలు చేసిన సుగుణమ్మ.. కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన అబ్జర్వర్, స్థానిక ఆర్వోగా ఉన్న విజయరామరాజు అవకతవకలకు పాల్పడ్డారని మండిపడ్డారు. కాగా, సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి నియోజకవర్గం నుంచి వైసీపీ సీనియర్ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి విజయం సాధించిన సంగతి తెలిసిందే.