గెలిచినా.. ఓడినా కేసీఆర్ ఫాం హౌస్‌లోనే

గెలిచినా.. ఓడినా కేసీఆర్ ఫాం హౌస్‌లోనే

టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌పై తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం తీవ్ర విమర్శలు చేశారు. మేడ్చల్‌లో జరుగుతున్న కాంగ్రెస్ భారీ బహిరంగ సభకు కోదండరాం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ ఇచ్చిన వ్యక్తి ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎందరో విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేదు. ఈ టీఆర్ఎస్ పాలనలో రేషన్ డీలర్లు పడ్డ కష్టం అందరికీ తెలిసిందే. రుణమాఫీ పైసలు ఇంకా అకౌంట్లలో చేరలేదన్నారు. విద్యార్థులకు ఫీజు మాఫీ కాలేదు.. గట్టిగ అడిగినందుకు జైల్లో పెట్టారని మండిపడ్డారు. మమహిళలు పావలా వడ్డీ కూడా దక్కకుండా అవస్థలు పడ్డారన్నారు. ఆఖరికి ధర్నా చౌక్ ను కూడా మూసివేశారని ఆయన తెలిపారు.

ఇంకా కోదండరాం మాట్లాడుతూ.. కేసీఆర్ ఖానాపూర్‌లో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. ఆ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో మీరు ఓటేసినా మంచిదే.. వేయకున్నా మంచిదే అని  పేర్కొన్నారు. 'కేసీఆర్ అధికారంలో ఉన్నా ఫామ్‌హౌస్‌లోనే, ఓడినా ఫామ్‌హౌస్‌కే వెళ్తానంటున్నారని.. ఫాం హౌస్‌లో పండుకునేటోడికి ఓటెందుకేయాలి' అని కోదండరాం ప్రశ్నించారు. టీఆర్ఎస్‌కు వేసే ఓటు  బురదగుంటలో వేసినట్టే వృథా అవుతుందన్నారు. టీఆర్ఎస్ నుంచి రాష్ట్రాన్ని విడిపించేందుకు ప్రజాకూటమిగా ఏర్పాడ్డామని కోదండరాం వివరించారు. ప్రతి వర్గానికి న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే మేమందరం కలిశామన్నారు.