ఆర్థిక మంత్రిపై తృణ‌మూల్ ఎంపీ తీవ్ర వ్యాఖ్య‌లు... బీజేపీ కౌంట‌ర్ ఎటాక్‌..

ఆర్థిక మంత్రిపై తృణ‌మూల్ ఎంపీ తీవ్ర వ్యాఖ్య‌లు... బీజేపీ కౌంట‌ర్ ఎటాక్‌..

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు మామూలు విష‌య‌మే.. కానీ, కొన్ని సార్లు నేత‌లు నోరుజారిచేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దం అవుతాయి.. తాజాగా.. కేంద్ర ఆర్ధికశాఖ‌ మంత్రి నిర్మలా సీతారామన్‌పై తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సెరాంపూర్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.. పెట్రో ధరల పెంపును నిరసిస్తూ బంకురా జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న ఆయ‌న‌.. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. భార‌త ఆర్ధిక వ్యవస్థను నిర్మ‌లా సీతారా‌మ‌న్ నాశనం చేశారని ఆరోపించారు. ఆమెను కాలనాగుతో పోల్చారు.. అంతేకాదు.. ఇలాంటి ఆర్ధిక మంత్రిని తాను ఎప్పుడూ చూడ‌లేద‌ని.. పాముకాటుకు మనుషులు చనిపోయినట్లుగానే.. నిర్మ‌లా సీతారామ‌న్ ఆర్థిక వ్య‌వ‌హారాల‌తో ప్ర‌జ‌లు చనిపోతున్నారని విమ‌ర్శించారు.. 

అయితే.. తృణ‌మూల్ ఎంపీ క‌ల్యాణ్ బెన‌ర్జీ వ్యాఖ్య‌లు దుమారాన్నే రేపాయి.. ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై బీజేపీ నేత‌లు తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతున్నారు. పార్టీ చీఫ్, సీఎం మమతా బెనర్జీ పట్టుకోల్పోయారని చెప్ప‌డానికి తాజాగా.. ఎంపీ కల్యాణ్ బెనర్జీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే ఉదాహరణగా పేర్కొన్నారు పశ్చిమబెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్.. మ‌మ‌తా బెన‌ర్జీ పాలన అవినీతిమయమైపోయిందని, ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుండటంతో సహనం లేక తృణమూల్ నేతలు ఇలాంటి మతిలేని వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు దిలీప్ ఘోష్‌.. మ‌రోవైపు.. నిర్మ‌లా సీతారామ‌న్‌పై తృణ‌మూల్ ఎంపీ క‌ల్యాణ్ బెన‌ర్జీ చేసిన వ్యాఖ్య‌ల‌ను నిర‌సిస్తూ.. ప‌శ్చిమ బెంగాలో ప‌లు చోట్ల నిర‌స‌న‌లు వ్య‌క్తం చేశారు బీజేపీ శ్రేణులు.