ఆర్టీసీ సమ్మెకు మద్దతు ఇవ్వం...భోజనం మీద విమర్శలా ?

ఆర్టీసీ సమ్మెకు మద్దతు ఇవ్వం...భోజనం మీద విమర్శలా ?

ఆర్టీసీ సమ్మెకు టీఎన్‌జీవో మద్దతు ప్రకటించలేదు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు న్యాయబద్ధమైనవేనన్న టీన్‌జీవో సమ్మెకు మద్దతు మాత్రం ఇవ్వమని చెప్పింది. సమ్మెకు వెళ్లేముందు ఆర్టీసీ జేఏసీ నేతలు తమను సంప్రదించలేదని టీఎన్‌జీవో నేత రవీందర్ రెడ్డి ఆరోపించారు. ముందు సమాచారం ఇవ్వకుండా ఇప్పుడు సమ్మెకు మద్దతివ్వాల్సిందిగా ఒత్తిడి తేవడం సరికాదని అన్నారు. విధులకు సంబంధించి తమ నిబంధనలు, ఆర్టీసీ నిబంధనలు వేరని ఆయన అన్నారు.

అయినా ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సిందేనన్నారు. అలాగే సీఎం కేసీఆర్‌తో కలిసి మధ్యాహ్న భోజనం చేయడంపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు టీఎన్‌జీవో అధ్యక్షుడు రవీందర్ రెడ్డి. భోజన  సమయంలో ఇంటికి వచ్చిన వారికి అన్నం వడ్డించడం తెలంగాణ సంప్రదాయమని, ఆ ప్రకారమే కేసీఆర్‌తో కలిసి తాము భోంచేశామని తెలిపారు. విందుకోసమే అక్కడికి వెళ్లామన్న ఆరోపణల్లో నిజం లేదన్నారు.

సీఎంతో తమ భేటీపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ప్రతిపక్షాల మద్దతుపై టీఎన్‌జీవో అధ్యక్షుడు రవీందర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. సకల జనుల సమ్మెను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించిన రాజకీయ పార్టీలే ఇప్పుడు ఆర్టీసీ సమ్మెకు మద్దతు పలుకుతున్నాయని ఆయన ఆరోపించారు. స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం ఆలోచించే నాయకుల విషయంలో ఆర్టీసీ కార్మికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాజకీయాలతో సంబంధం లేకుండా ఆర్టీసీ సమ్మె కొనసాగాలని కోరారు.