నేడు జగన్ చేతుల మీదుగా పైలాన్ ఆవిష్కరణ

నేడు జగన్ చేతుల మీదుగా పైలాన్ ఆవిష్కరణ

వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ముగింపు దశకు చేరుకుంది. 341 రోజులపాటు మొత్తం 3,648 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన జగన్‌..ఈరోజు తన యాత్రను ముగించనున్నారు. ఈ సందర్భంగా బహుదా నదీ తీరంలో నిర్మించిన పైలాన్ ను ఆయన ఆవిష్కరించనున్నారు. ప్యారీస్ లోని ఈఫిల్ టవర్ ను తలపిస్తూ నాలుగు ఉక్కు స్తంభాల కింద నుంచి విడిగా పైకి వెళ్లి పైన నాలుగూ కలిసేలా ఏర్పాటు చేసిన పైలాన్ కనువిందు చేస్తుంది. గతంలో దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి, ఆయన కుమార్తె షర్మిల చేపట్టిన పాదయాత్ర, ఇప్పుడు జగన్ పాదయాత్ర కలిపి మొత్తం ముగ్గురి పాదయాత్రలు గుర్తుకు వచ్చేలా ప్రజా ప్రస్ధాన ప్రాంగణాన్ని నిర్మించారు. జగన్ పాదయాత్ర 13 జిల్లాల్లో సాగిందనేదానికి గుర్తుగా ఈ స్థూపం అడుగు నుంచి అన్నే మెట్లు నిర్మించారు. మొత్తం నాలుగు పిల్లర్లపై మూడు అంతస్తుల్లో ఈ స్థూపం నిర్మాణం జరిగింది. మొదటి అంతస్తులో వైఎస్ జగన్ పాదయాత్ర ఫోటో, రెండో అంతస్తులో వైఎస్ ఫోటో ఉంచారు.

ఒడిషా రాష్ట్ర సరిహద్దుల్లోకి ప్రవేశించడానికి సుమారు 30 కిలో మీటర్ల ముందు, శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి 130 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటైన ఈ పైలాన్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 16వ నంబర్ జాతీయ రహాదారి పక్కనే నిర్మించిన ఈ నిర్మాణానికి మరో వైపు హౌరా- చెన్నై రైల్వే లైన్ ఉంది. దీంతో అటు బస్సుల్లో, ఇటు రైళ్లలో ప్రయాణించే వారికి స్థూపం కనువిందు చేయనుంది.